Asianet News TeluguAsianet News Telugu

ఇండియాతో టెస్టు సిరీస్ కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్.. స్పిన్నర్లకే అగ్రతాంబూలం

India Vs Newzealand:న్యూజిలాండ్ జట్టు.. నవంబర్ 17 నుంచి భారత్ తో మూడు టీ20 లుఆడనున్నది. ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్..  టీ20, టెస్టులకు గాను జట్టును ప్రకటించింది.

Newzealand announce 15 member squad for upcoming india Test series here is the list
Author
Hyderabad, First Published Nov 5, 2021, 1:33 PM IST

యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ జట్టు భారత్ లో పర్యటించనున్నది. ఇండియాతో కివీస్ 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సి ఉంది.  ఈ నేపథ్యంలో న్యూజిలాండ్..  టీ20, టెస్టులకు గాను జట్టును ప్రకటించింది. కాగా, ఉపఖండపు స్పిన్ పిచ్ లను దృష్టిలో పెట్టుకుని టెస్టు జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం విశేషం. 

న్యూజిలాండ్ జట్టు.. నవంబర్ 17 నుంచి భారత్ తో మూడు టీ20 లుఆడనున్నది. ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. నవంబర్ 17న జైపూర్ లో తొలి టీ20, రాంచీలో 19న రెండో టీ20, చివరిదైన మూడో టీ20 21 న ఈడెన్ గార్డెన్ లో జరుగుతుంది. ఇక నవంబర్ 25-29 మధ్య కాన్పూర్ లో తొలి టెస్టు.. డిసెంబర్ 3-7 మధ్య రెండో టెస్టు ముంబైలో ఆడాల్సి ఉంది. 

కాగా, టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్.. ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, కోలిన్ డి గ్రాండ్ హోమ్ కు విశ్రాంతినిచ్చింది. టెస్టులకు విశ్రాంతినిచ్చినా బౌల్ట్ మాత్రం టీ20 సిరీస్ ఆడనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్-2 లో  భాగంగా ఈ టెస్టు సిరీస్ జరుగనుంది. అయితే ఉపఖండంలో స్పిన్ పిచ్ లను దృష్టిలో ఉంచుకుని ఈసారి  న్యూజిలాండ్ టెస్టు జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం గమనార్హం.  15 మంది టెస్టు జట్టు సభ్యులలో.. సీనియర్ స్పిన్నర్లైన అజాజ్ పటేల్,  సోమర్విల్లి, మిచెల్ సాంట్నర్ తో పాటు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ ను కూడా ఎంపిక చేశారు. 

 

ఫాస్ట్ బౌలర్లలో టిమ్ సౌథీ బౌలింగ్ దళానికి నేతృత్వం వహిస్తున్నాడు. విల్ యంగ్, నీల్ వాగ్నర్ లు కూడా  పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. కెప్టెన్ కేన్ విలియమ్సన్, కాన్వే, జెమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్ ఉన్నారు. ఇక గత రెండున్నర నెలలుగా విరామం లేని క్రికెట్ ఆడుతున్న ట్రెంట్ బౌల్ట్ కు ఈ సిరీస్ లో విశ్రాంతినిచ్చారు. అలాగే కొలిన్ కూడా మే నుంచి తీరిక లేని షెడ్యూల్ లో ఉన్నాడు.  ఈ నేపథ్యంలో వీరిద్దరికీ విశ్రాంతినివ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. 

ఇదిలాఉండగా.. కివీస్ తో సిరీస్ కు భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూడు టీ20 మ్యాచులకు కెప్టెన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. చాలా మంది సీనియర్లకు విశ్రాంతినిచ్చి యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నది.  ఈ ప్రపంచకప్ తో టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న విరాట్ స్థానంలో రోహిత్  ఎంపిక ఖాయమే గానీ.. అతడికి కూడా విశ్రాంతినివ్వనున్నట్టు సమాచారం. అలా అయితే  కెఎల్ రాహుల్.. సారథి బాధ్యతలు మోసే అవకాశం ఉంది.  ఇక తాత్కాలిక కోచ్ గా నియమితుడైన రాహుల్ ద్రవిడ్ కూడా.. ఈ సిరీస్ నుంచే పని మొదలుపెట్టనున్నాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవికాలం ఈ ప్రపంచకప్ తో ముగియనున్నది. 


ఇండియాతో టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు:  కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌ కీపర్‌), ఇష్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే


ఇండియాతో టెస్టు సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), కాన్వే,  కైల్ జెమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్విల్లి, టిమ్ సౌథి, రాస్ టేలర్, విల్ యంగ్, నీల్ వాగ్నర్

Follow Us:
Download App:
  • android
  • ios