Mohammed Shami: వయసు మీద పడుతున్నా ఇప్పటికీ టెస్టులు, వన్డేలలో భారత్ కు కీలక బౌలర్ గా ఉన్న షమీ.. వాస్తవానికి 2018లోనే అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్దామనుకున్నాడట.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ భారత జట్టుకు టెస్టులు, వన్డేలలో కీలక బౌలర్. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్ టెస్టులో షమీ.. తొలి ఇన్నింగ్స్ లో ఒకటి, రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీయడమే గాక బ్యాటింగ్ లోనూ రాణించి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ టెస్టులు, వన్డేలలో భారత్ కు కీలక బౌలర్ గా ఉన్న షమీ.. వాస్తవానికి 2018లోనే అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్దామనుకున్నాడట.
భారత జట్టులో చోటు కోల్పోయేసరికి చిర్రెత్తుకొచ్చిన షమీ.. ‘ఇక నా వల్ల కాదు. నేను క్రికెట్ కు పనికిరాను.. రిటైర్ అవుతా’నని చెప్పాడట. కానీ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి షమీ మనసు మార్చి అతడిని మళ్లీ కొనసాగేలా చేశాడట.
ఈ విషయాలను టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు. భరత్ అరుణ్ క్రిక్ బజ్ తో మాట్లాడుతూ... ‘‘2018లో భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లడానికి ముందు మేం ఫిట్నెస్ టెస్టు నిర్వహించాం. ఆ టెస్టులో షమీ ఫెయిల్ అయ్యాడు. భారత జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఆ కోపంలో అతడు నాకు ఫోన్ చేసి మీతో ఓ విషయం మాట్లాడాలని చెప్పాడు. నేను అతడిని నా రూమ్ కు రమ్మన్నాను.
ఇదీ చదవండి: నా దృష్టిలో బాబర్, పదో నెంబర్ బ్యాటర్ ఇద్దరూ ఒక్కటే.. : పాక్ మాజీ పేసర్
అప్పటికే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న షమీ నా రూమ్ కు వచ్చి ‘నా మీద నాకే చాలా కోపంగా ఉంది. నేను క్రికెట్ నుంచి తప్పుకుందామనుకుంటున్నా..’అని చెప్పాడు. అప్పుడే నేను షమీని రవిశాస్త్రి దగ్గరికి తీసుకెళ్లాను. వెళ్లాక.. ‘రవి, షమీ నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు’ అన్నాను. రవి ‘ఏంటది..?’అని అడిగాడు. అప్పుడు షమీ.. ‘నేను ఇక క్రికెట్ ఆడదలుచుకోలేదు. రిటైర్ అవుదామనుకుంటున్నా..’అని చెప్పాడు. అప్పుడు మేమిద్దరం మరి క్రికెట్ ఆడకుంటే నువ్వేమి చేస్తావు..? అని అడిగాం. ఇది కాకుంటే నీకు ఏం తెలుసు..? అని ప్రశ్నించాం.. దానికి షమీ దగ్గర సమాధానం లేదు.
కొంతసేపటి తర్వాత రవి షమీతో..‘నువ్వు కోపంతో ఉండటం ఒక విధంగా మంచిదే. నీలో ఇంకా సత్తా ఉంది. కానీ ఫిట్నెస్ లో ఫెయిల్ అయ్యావు. దానికే రిటైర్ అవ్వాల్సిన పన్లేదు. నీకు కోపం ఏదైతే ఉందో దానిని నీ ఫిట్నెస్ మీద పెట్టు. నువ్వు ఇంటికి (కోల్కతా) వెళ్లకు. ఎన్సీఏకు వెళ్లు. అక్కడ నీ బాడీ మీద దృష్టి సారించు..’అని చెప్పాడు. దానికి సరే అన్న షమీ.. ఎన్సీఏలో ఐదు వారాలు గడిపాడు. కఠిన నియమాలు పాటించి ఫిట్నెస్ టెస్టు పాస్ అవడమే గాక తిరిగి జట్టులోకి కూడా వచ్చాడు...’’అని అరుణ్ చెప్పుకొచ్చాడు.
ఆ ఘటన తర్వాత షమీ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టులలో ఏకంగా 16 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లి భారత్ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు.
