- Home
- Sports
- Cricket
- కోహ్లీ పాపులారిటీతో రోహిత్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదు..కానీ అదే అతడిని కాపాడింది : ఇయాన్ చాపెల్
కోహ్లీ పాపులారిటీతో రోహిత్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదు..కానీ అదే అతడిని కాపాడింది : ఇయాన్ చాపెల్
INDvsAUS: గత దశాబ్దంలో కోహ్లీకి వచ్చిన విపరీతమైన పాపులారిటీ వల్ల రోహిత్ కు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఉన్న పాపులారిటీ కారణంగా ప్రస్తుతం జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మకు రావాల్సినంత గుర్తింపు రాలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్. ఢిల్లీ టెస్టుకు ముందు చాపెల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
నాగ్‌పూర్ టెస్టులో ఇరు జట్ల బ్యాటర్లు పిచ్ మీద నిలవడానికే ఇబ్బందులు పడుతున్న వేళ రోహిత్ శర్మ నిలిచాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీ చేశాడు. మరోవైపు టెస్టులలో పేలవ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ.. 12 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు అయితే కనీసం క్రీజులో నిలవడానికే తంటాలుపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ సారథి ఇయాన్ చాపెల్ రోహిత్ పై ప్రశంసలు కురిపించాడు. ‘టెస్టు క్రికెట్ లో ఓపెనర్ గా ముందుకువెళ్లడం రోహిత్ శర్మ కెరీర్ ను కాపాడింది. ఒకవేళ మిడిలార్డర్ లో వచ్చి ఉంటే అతడి టాలెంట్ వృథా అయ్యేది. కానీ ఓపెనర్ గా ఆడి మెరుగయ్యాడు.
అయితే గత దశాబ్దంలో కోహ్లీకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ క్రేజ్ వల్ల రోహిత్ కు రావాల్సిన గుర్తింపు రాలేదు. కానీ అతడు తిరిగి పుంజుకోవడంలో కెప్టెన్సీ కూడా కీలక పాత్ర పోషించింది. జట్టును మెరుగైన దిశగా నడిపించేందుకు అవసరమైన క్రమశిక్షణ హిట్‌మ్యాన్ ఆటను మరోస్థాయికి తీసుకెళ్లింది.
నాగ్‌పూర్ టెస్టులో బ్యాటర్లంతా అలా వచ్చి ఇలా వెళ్తుంటే రోహిత్ నిలబడ్డాడు. పిచ్ ను అర్థం చేసుకుని ఆడాడు. ఓపికగా ఆడితే ఇదేం కష్టతరమైన పిచ్ కాదని రెండు జట్ల ఆటగాళ్లకూ చూపించాడు. రోహిత్ బాటలో రవీంద్ర జడేజా కూడా నడిచాడు...’అని చెప్పాడు.
కాగా నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 177 పరుగులకే కుప్పకూలింది. తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400 రన్స్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో రోహిత్.. సెంచరీ (120) తో చెలరేగాడు. జడేజా, అక్షర్ కూడా రాణించారు. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్లు కనీసం పిచ్ లో పట్టుమని పది నిమిషాలు కూడా నిలువడానికే తంటాలుపడ్డారు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఆ జట్టు బ్యాటర్లలో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు.