PSL 2023: పాకిస్తాన్ క్రికెట్ సారథి బాబర్ ఆజమ్ పై  ఆ  జట్టు వెటరన్ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు బాబర్ ఆజమ్ అంటే భయం లేదని వ్యాఖ్యానించాడు.  

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో భాగంగా సోమవారం నుంచి 8వ సీజన్ మొదలైంది. ఈ లీగ్ లో ఆటగాళ్ల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు టోర్నీని మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రత్యర్థి జట్టులో స్ట్రాంగ్ బ్యాటర్లను లక్ష్యంగా చేసుకుని బౌలర్లు నోటికి పనిచెబుతున్నారు. తాజాగా పాకిస్తాన్ వెటరన్ పేసర్ మహ్మద్ అమిర్ కూడా ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో బాబర్ ఆజమ్ ఏం గొప్ప కాదని.. పదో నెంబర్ (టెయిలెండర్) బ్యాటర్ కు ఎలా బౌలింగ్ చేస్తానో బాబర్ కు కూడా అలాగే చేస్తానని వ్యాఖ్యానించాడు. 

కరాచీ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న అమీర్.. గతంలో ఇదే ఫ్రాంచైజీ తరఫున ఆడిన బాబర్ ఆజమ్ తో కలిసి ఆడాడు. ఇద్దరూ మాజీ సహచర ఆటగాళ్లే. కానీ ప్రస్తుత సీజన్ లో బాబర్.. పెషావర్ జల్మీ తరఫున ఆడుతున్నాడు. దీంతో బాబర్ - అమీర్ ల మధ్య రసవత్తర పోరు జరుగనుంది. నేడు ఈ రెండు జట్ల (కరాచీ - పెషావర్) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలో స్థానిక టీవీ ఛానెల్ తో అమీర్ మాట్లాడుతూ.. ‘ఇటువంటి మ్యాచ్ లు, ఆటగాళ్ల మధ్య పోటీలు టోర్నీని మరింత రసవత్తరంగా మారుస్తాయి. నాకు వ్యక్తిగతంగా ఇలాంటి సవాళ్లు చాలా ఇష్టం. దానివల్ల నేను ఆట మీద మరింత దృష్టి పెట్టగలను. వికెట్లు తీసి నా జట్టును గెలిపించడమే నా పని. అందుకే నాకు బాబర్ ఆజమ్ అయినా టెయిలండర్ బ్యాటర్ అయినా ఒక్కటే. నా మెయిన్ గోల్ వికెట్ తీయడమే. అవతలి బ్యాటర్ ఎవరన్నది నాకు సంబంధం లేదు..’అని చెప్పాడు. 

అమీర్ వ్యాఖ్యలకు బాబర్ కూడా కౌంటర్ ఇచ్చాడు. అతడు మాట్లాడుతూ.. ‘లీగ్ లో కాంపిటీషన్ అనేది మంచిదే. ఒక్క కరాచీలోనే కాదు. ప్రతి ఫ్రాంచైజీలో కూడా స్థానికంగా మంచి బౌలర్లు ఉన్నారు. వారందరినీ ఎదుర్కోవడం సవాల్ తో కూడుకున్నది. అందుకే ఫారెన్ ప్లేయర్లు ఈ లీగ్ లో ఆడేందుకు అమితాసక్తితో ఉంటారు. నేను కూడా క్వాలిటీ బౌలర్లను ఎదుర్కునేప్పుడు నా బేసిక్స్ ను అమలుపరుచుతాను. వాటి అనుగుణంగానే ముందుకెళ్తాను..’అని చెప్పాడు. 

కాగా పీఎస్ఎల్-8వ సీజన్ సోమవారం (ఫిబ్రవరి 13న) మొదలైంది. తొలి మ్యాచ్ లాహోర్ ఖలాండర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగింది. తొలుత లాహోర్.. నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (66), మీర్జా బేగ్ (32) లు రాణించారు. అనంతరం ముల్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగుల వద్దే ఆగిపోయింది. ఆ జట్టు సారథి మహ్మద్ రిజ్వాన్ (75) పోరాడాడు. షాన్ మసూద్ (35) కూడా రాణించాడు. ఆఖరి ఓవర్లో ముల్తాన్.. 15 పరుగులు చేయాల్సి ఉండగా మూడు వికెట్లు కోల్పోయి 13 పరుగుల వద్దే ఆగిపోయింది.