టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచ కప్ సందర్భంలో అంతర్జాతీయ స్థాయిలోని అన్ని ఫార్మాట్లకు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆవేశంతో తీసుకున్న ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.

అంబటి రాయుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నట్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించి ఓ లిఖితపూర్వక లేఖను అతడె హెచ్‌సీఏ కు అందించాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించడానికి ప్రేరేపించిన కారణాలతో పాటు ఇప్పుడు తన నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నాడో వివరిస్తూ రాయుడు ఈ లేఖ రాసినట్లు సమాచారం. 

ఈ సందర్బంగా అంబటి రాయుడు మాట్లాడుతూ...క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి, మాజీ తెలుగు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశాడు. తన కెరీర్ గురించి డైలమాలో వున్న సమయంలో వీరు నాకెంతో సహాయం అందించారని రాయుడు తెలిపాడు. 

ఇకపై తాను అన్ని ఫార్మాట్లలో క్రికెట్ ఆడేందుకు అందుబాటులో వుంటానని ప్రకటించాడు. అలాగే ఐపిఎల్ కెరీర్ ను యదావిధిగా కొనసాగిస్తానని తెలిపాడు. తానింకా చాలా క్రికెట్ ఆడాల్సివుందని ఈ సందర్భంగా రాయుడు కాస్త భావోద్వేగంగా వెల్లడించాడు. 

అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా తరపున రాయుడు 55 వన్డే మ్యాచులు ఆడి 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్థ సెంచరీలు ఉన్నాయి. అలాగే 6 టీ20 మ్యాచుల్లో 42 పరుగులు చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వివిధ జట్ల తరపున 147 మ్యాచులాడి 3300 పరుగులు  చేశాడు. ఇందులో ఒక సెంచరీ 18 హాఫ్ సెంచరీలున్నాయి. 

భారత జట్టుకు నాలుగో స్థానంలో ఆడే సరైన బ్యాట్స్ మెన్ దొరకని సమయంలో అంబటి రాయుడు ఆ స్థానంలో రాణించాడు. ఆ స్థానంలో నిలకడైన ఆటగాడిగా పేరు  సంపాదించుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ వేదికన జరిగే  ప్రపంచ కప్ లో అవకాశం వస్తుందని భావించాడు. కానీ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతడికి మొండిచేయి చూపించింది. దీంతో మనస్థాపం చెందిన రాయుడు ఆవేశంలో రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.   

సంబంధిత వార్తలు 

అంబటి రాయుడు మరో సంచలన నిర్ణయం... రిటైర్మెంట్ పై యూటర్న్