మాజీ టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ప్రపంచ కప్ మెగాటోర్నీలో తనకు అవకాశం రాలేదన్న తొందరపాటుతో అతడు క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అతడు మళ్లీ క్రికెట్లోకి పునరాగమనం చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. 

తెలుగు క్రీడాకారుడైన అంబటి రాయుడు హైదరాబాద్ క్రికెట్ సంఘం  తరపున ఆడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. హె‌చ్‌సీఏ తరపున మళ్లీ రంజీల్లో బరిలోకి దిగడమే కాదు అవకశామిస్తే భారత జట్టు తరపున అంతర్జాతీయ మ్యాచులు ఆడటానికి సుముఖంగా  వున్నాడు. ప్రస్తుతానికయితే హెచ్‌సీఏ  నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్  మ్యాచుల్లో మళ్లీ బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాడు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో  పుట్టిపెరిగిన అంబటి రాయుడు హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. ఇతడు మొత్తం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 6 వేల పైచిలుకు పరుగులు చేశాడు. 

ఇక అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా తరపున అతడు 55 వన్డే మ్యాచులు ఆడి 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్థ సెంచరీలు ఉన్నాయి. అలాగే 6 టీ20 మ్యాచుల్లో 42 పరుగులు చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వివిధ జట్ల తరపున 147 మ్యాచులాడి 3300 పరుగులు  చేశాడు. ఇందులో ఒక సెంచరీ 18 హాఫ్ సెంచరీలున్నాయి. 

భారత జట్టుకు నాలుగో స్థానంలో ఆడే సరైన బ్యాట్స్ మెన్ దొరకని సమయంలో అంబటి రాయుడు ఆ స్థానంలో రాణించాడు. ఆ స్థానంలో నిలకడైన ఆటగాడిగా పేరు  సంపాదించుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ వేదికన జరిగే  ప్రపంచ కప్ లో అవకాశం వస్తుందని భావించాడు. కానీ  ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతడికి మొండిచేయి చూపించింది. దీంతో మనస్థాపంచెందిన అతడు ఆవేశంలో రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.