Asianet News TeluguAsianet News Telugu

సన్‌ రైజర్‌ కొడితే కుంభస్థలమే.. ఢిల్లీకి చుక్కలు చూపించిన హైదరాబాద్‌.. పంత్‌ సేనాపై ఘన విజయం..

ఢిల్లీ కాపిటల్స్ కి చుక్కలు చూపించింది హైదరాబాద్‌ టీమ్‌. భారీ ఛేజింగ్‌గా చేతులెత్తేసిన ఢిల్లీపై సర్‌ రైజర్స్ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. 
 

hyderabad won on delhi with 67 runs its big jump to sunrises team arj
Author
First Published Apr 21, 2024, 12:29 AM IST

టాటా ఐపీఎల్‌ 2024 రసవత్తరంగా సాగుతుంది. ఒక టీమ్‌ని మించి మరో టీమ్‌ ఆట ఉండటంతో ఆద్యంతం రక్తికట్టించేలా ఈసారి ఐపీఎల్‌ సాగుతుంది. భారీ రన్‌ రేట్‌, భారీ ఛేజింగ్‌లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. సినిమాలను మించిన వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా శనివారం సర్‌రైజర్స్ హైదరాబాద్‌, ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ రసవత్తరంగా సాగడం విశేషం. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పంత్‌ సేనాపై హైదరాబాద్‌ భారీ విజయాన్ని సాధించింది. కొడితే కుంభస్థలమే కొట్టినట్టుగా టాప్‌ 10 జాబితాలో టాప్‌ 2 కి చేరింది. 

గత సీజన్లలో హైదరాబాద్‌ టీమ్‌ పేలవమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంది. కానీ ఈ ఐపీఎల్‌ సీజన్‌ 17లో మాత్రం హైదరాబాద్‌ టీమ్‌ దుమ్మురేపుతుంది. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ నాలుగు విజయాలను నమోదు చేసుకుంది. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ టీమ్‌ ఏడు వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. 

ఇంతటి భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీ టీమ్‌ ప్రారంభంలో మెరుపులు కనబరిచింది. ఏడు ఓవర్లలో వంద పరుగులు చేసి సక్సెస్‌ దిశగా వెళ్లింది. అందరిలోనూ సక్సెస్‌ ఆశలు నింపింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో స్కోర్‌ తగ్గిపోయింది. బ్యాటింగ్‌ స్లో అవుతూ వచ్చింది. 15ఓవర్లలో 160దాటిన ఢిల్లీ ఆ తర్వాత మాత్రం మరింతగా డౌన్‌ అయిపోయింది. 19.1 ఓవర్లలో 199పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. హైదరాబాదీ బౌలర్‌ నటరాజన్‌ బౌలింగ్‌లో చేసిన మ్యాజిక్‌కి ఢిల్లీ కుప్పకూలిపోయింది. ఏకంగా నాలుగు వికెట్లు తీసి పంత్‌ టీమ్‌ని పడగొట్టాడు నటరాజన్‌. కేవలం 19 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం విశేషం. ఆయనతోపాటు మయాంక్‌ మర్కండే రెండు వికెట్లు, నితీష్‌ కుమార్‌ రెడ్డి రెండు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాట్స్ మెన్స్ ని వరుసగా పెవీలియన్‌కి పంపించారు. హైదరాబాద్‌ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 

ఇక హైదరాబాద్‌ టీమ్‌లో ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ 89 పరుగులు, అభిషేక్‌ శర్మ 46 పరుగులతో చెలరేగిపోయారు. వీరి విధంసం ముందు ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. వీరికి తోడుగా షాబాజ్‌ అహ్మద్‌ 59 పరుగులు, నితీష్‌ రెడ్డి 37 పరుగులు చేసి హైదరాబాద్‌ స్కోర్‌ని అమాంతం రెండు వందలు దాటించారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 15 పరుగులు, అబ్దుల్‌ సమద్‌ 13 పరుగులకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ సైతం నాలుగు వికెట్లు తీశారు. కానీ ఈలోపు రావాల్సిన దానికి మించిన రన్‌ రేట్‌ రావడంతో హైదరాబాద్‌ భారీ పరుగులు చేయగలిగింది. 

ఢిల్లీ టీమ్‌లో  పృథ్వీ షా 16 పరుగులు, డేవిడ్‌ వార్నర్‌ ఒకటి, జేక్‌ ఫ్రేజర్‌ 65, అభిషేక్‌ పోరెల్‌ 42 పరుగులతో మెరుపులు మెరిపించారు. కానీ ఆ తర్వాత ఎవరూ ఆ స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయారు. చివరగా రిషబ్‌ పంత్‌ 44 పరుగులతో మెరిసినా ప్రయోజనం లేదు. తనకు పార్టనర్‌గా ఎవరూ క్రీజులో గట్టిగా నిలబడలేకపోవడంతో ఆయన కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి. దీంతో నటరాజన్‌ దెబ్బకి ఢిల్లీ సేనా మరో ఓవరు మిగిలి ఉండగానే ఆలౌట్‌ అయ్యింది. భారీ తేడాతో హైదరాబాద్‌ విజయం సాధించింది. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఐపీఎల్‌ టాప్‌ 10 జాబితాలో హైదరాబాద్‌ రెండవ స్థానానికి చేరుకోవడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios