ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి రెచ్చిపోయాడు. బ్యాట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డీవీ పాటిల్ టీ20 కప్ పోటీల్లో ఇప్పటికే అతను రెండు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 20 సిక్స్ లు కొట్టి ప్రత్యర్థులను నిశ్చేష్టులను చేశాడు. 

డీవై పాటిల్ టోర్నీలో రిలయన్స్ -1 తరఫున ఆడుతున్న హార్దిక్ పాండ్యా తాజా మ్యాచులో 39 బంతుల్లో సెంచరీ సాధించాడు. మిడాన్ మీదుగా సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింతగా చెలరేగిపోయి 55 బంతుల్లో 158 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇందులో 20 సిక్స్ లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో పాండ్యాకు ఇది రెండో సెంచరీ.

Also Read: 39 బంతుల్లో 105 పరుగులు: రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా 

ఈ మ్యాచులో టాస్ గెలిచిన బీపీసిఎల్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన రిలయన్స్ -1 బ్యాటింగ్ కు దిగింది. టాపార్డర్ లో హార్డిక్ పాండ్యా దూకుడుగా ఆడడంతో 238 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్ గా హార్దిక్ పాండ్యా రికార్డులకు ఎక్కాడు. 

అంతకు ముందు టీ20 ఫార్మాట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్ రికార్డు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆయన 147 పరుగులు చేశాడు. దాన్ని హార్దిక్ పాండ్యా బ్రేక్ చేశాడు.