ముంబై: జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి ఉవ్విళ్లూరుతున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన సత్తా చాటుతున్నాడు. డీవై పాటిల్ 220 టోర్నమెంటులో అతను బ్యాట్ తో రెచ్చిపోయాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ బాదేశాడు. 39 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇందులో పది సిక్స్ లు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. 

డీవై పాటిల్ టీ20లో రిలయన్స్1 తరఫున పాండ్యా ఆడుతున్నాడు. సిఏజీతో జరిగిన మ్యాచులో కళ్లు చెదిరే సిక్సర్లు, బౌండరీలు బాదాడు. మైదానం అన్ని వైపులా షాట్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. వీ జీవరాజన్ వేసిన 15వ ఓవర్ లో పాండ్యా 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 26 పరుగులు రాబట్టాడు.

పాండ్యా దూకుడుతో రిలయన్స్ 1 జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. మరో స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ విఫలమయ్యాడు. ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. చివరి వారం జరిగిన మ్యాచులోనూ హార్దిక్ పాండ్యా దూకుడు ప్రదర్శించాడు. బ్యాంక్ ఆప్ బరోడాపై 25 బంతుల్లో 38 పరగులు చేశఆడు. అదే మ్యాచులో భువనేశ్వర్  కుమార్, శిఖర్ ధావన్ కూడా తిరిగి మైదానంలోకి దిగారు.