రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు కోసం ఈ ఏడాది టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేరును పంజాబ్ ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత దానిని అనూహ్యంగా ఉపసంహరించుకోవడం కలకలం రేపింది.

అయితే ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదని, వారు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని భజ్జీ వివరణ ఇచ్చారు. కొంతమంది ఈ అంశాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also Read:భారత అభిమానిపై ఇంజమామ్ దాడి... అజారుద్దిన్ భార్య కోసమే: వకార్ యూసిస్

ఈ విషయంలో ప్రభుత్వం సరిగానే పని చేసిందని.. ఖేల్‌రత్న నిబంధన ప్రకారం గత మూడేళ్లకాలంలో అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణనలోనికి తీసుకోవాలని హర్భజన్ కోరారు. అలా చూస్తే తనకు అర్హత లేదని.. అందువల్ల తానే దరఖాస్తు వెనక్కి తీసుకోమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని భజ్జీ చెప్పారు.

ప్రభుత్వం అంగీకరించిందని హార్భజన్ వెల్లడించారు. అయితే భారత జట్టు తరున 2016 మార్చిలో చివరిసారిగా బరిలోకి దిగిన హార్భజన్ పేరును అసలు అర్హతే లేకుండా ఇప్పుడు ఎందుకు ప్రతిపాదించారనేది ప్రాథమిక సందేహం. 40 ఏళ్ల హార్భజన్ భారత్ తరపున మూడు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 711 వికెట్లను పడగొట్టాడు.