మంచి భవిష్యత్తు ఉన్న విహారికి చాన్స్‌లు ఇవ్వకుండా అతన్ని తొక్కేస్తున్నారని.. వాస్తవానికి రహానే కెప్టెన్ కాకపోయుంటే అతన్ని పక్కన పెట్టేసి విహారి చాన్స్ ఇచ్చినా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విమర్శలు ఎక్కువగా రావడంతో... బీసీసీఐ వెనక్కి తగ్గింది.
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. నిలకడగా రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేసింది. అయితే.. గత కొంతకాలంగా.. తన ఆటతో అందరినీ ఆకట్టుకున్న హైదరాబాదీ క్రికెటర్ హనుమ విహారిపై మాత్రం వివక్ష చూపించారు.
అయితే తెలుగు క్రికెటర్ హనుమ విహారిని పక్కనపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమానులు బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమ విహారి పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడుతున్నారు.
గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో హనుమ విహారి అద్బుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను పరాజయం నుంచి తప్పించాడు. అలాంటి క్లాస్ బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న విహారికి చాన్స్‌లు ఇవ్వకుండా అతన్ని తొక్కేస్తున్నారని.. వాస్తవానికి రహానే కెప్టెన్ కాకపోయుంటే అతన్ని పక్కన పెట్టేసి విహారి చాన్స్ ఇచ్చినా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విమర్శలు ఎక్కువగా రావడంతో... బీసీసీఐ వెనక్కి తగ్గింది.
టెస్టుల్లో అది కూడా ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ వికెట్లపై రాణించిన ఘనత మన విహారిది. తొడ కండరాల గాయం బాధిస్తున్నా... జట్టు అవసరాల కోసం గాయాన్ని పంటిబిగువన భరించి మరీ ఓ టెయిలెండర్ (అశ్విన్)తో కలిసి ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో భారత్‌ను ‘డ్రా’తో గట్టెక్కించాడు. అందరి నుంచీ ప్రశంసలందుకున్నాడు. తర్వాత ఇంగ్లండ్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపిక చేసినా తుది జట్టులో ఆడించలేదు.
ఫైనల్లో భారత ఓటమికి విహారిలాంటి నిలబడే బ్యాట్స్‌మన్ లేకపోవడం కూడా ఒక కారణం. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ విహారిని పక్కన బెట్టారు. ఈసారి సెలెక్షన్ కమిటీ ఏకంగా జట్టు నుంచే తప్పించింది. దీనికి సరైన కారణం కూడా సెలక్షన్ కమిటీ, బోర్డు దగ్గర లేదు. దీనిపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో విమర్శల నుంచి తప్పించుకునేందుకు విహారిని భారత్ ‘ఎ’ తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు పంపిస్తున్నామని శుక్రవారం సాయంత్రం బీసీసీఐ ఒక ట్వీట్ చేసింది. వాస్తవానికి ఈనెల 9న భారత ‘ఎ’ జట్టును ప్రకటించినపుడు అందులో విహారి పేరు లేకపోవడం గమనార్హం. విహారి తన కెరీర్‌లో 12 టెస్టులు ఆడి 32.84 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
