Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: మ్యాచ్ గెలవకపోవచ్చు..! కానీ నువ్వు యోధుడివి.. పాకిస్థాన్ క్రికెటర్ ను ఆకాశానికెత్తిన లక్ష్మణ్

Australia Vs Pakistan: గురువారం నాటి మ్యాచ్ కు  ముందు రెండ్రోజులు రిజ్వాన్ ఐసీయూలో గడిపాడు. రిజ్వాన్ తో పాటు షోయబ్ మాలిక్ సైతం ఆసీస్ తో  కీలక పోరుకు అందుబాటులో ఉంటారా..? లేదా..? అన్నది సందిగ్దమే. కానీ...

ICC T20 World Cup 2021: Aus vs Pak A True Warrior, Twitter Praise rizwan for taking field after two nights in hospital
Author
Hyderabad, First Published Nov 12, 2021, 7:12 PM IST

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా  గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో అపజయమెరుగని జట్టుగా సెమీస్ కు చేరిన పాక్..  ఓటమితో నిష్క్రమించింది. అయితే  ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చివరి నాలుగు ఓవర్ల ఆట తీసేస్తే  మ్యాచ్ లో పాకిస్థాన్ దే ఆధిపత్యం. ముఖ్యంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ జట్టు.. ఆసీస్ పేస్ దళాన్ని తట్టుకుని ఆడిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఆ జట్టు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ పై అయితే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ ఓడినప్పటికీ రిజ్వాన్ పోరాట పటిమ అనన్య సామాన్యమైందంటూ మాజీ క్రికెటర్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. 

రిజ్వాన్.. నిన్నటి మ్యాచ్ కంటే ముందు రెండ్రోజులు ఐసీయూలో గడిపాడు. నవంబర్ 9న అతడికి ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో రిజ్వాన్ ఆస్పత్రిలో చేరాడు. నిన్నటి మ్యాచ్ కు ముందు కూడా రిజ్వాన్ తో పాటు షోయబ్ మాలిక్ సైతం ఆసీస్ తో  కీలక పోరుకు అందుబాటులో ఉంటారా..? లేదా..? అన్నది సందిగ్దమే. కానీ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రిజ్వాన్.. దేశం కోసం వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి 67 (52 బంతుల్లో) పరుగులు చేశాడు. పాక్ భారీ స్కోరు సాధించడానికి కారణమయ్యాడు. ఇదే ఇప్పుడు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నది. 

 

ఇదే విషయమై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ లో స్పందించాడు. రిజ్వాన్ ధైర్యానికి, దృఢ సంకల్పానికి లక్ష్మణ్ ఫిదా అయ్యాడు. ‘ధైర్యానికి, దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణ. ఈ మ్యాచ్ లో అతడు గెలిచిన జట్టువైపు ఉండకపోవచ్చు. కానీ రెండ్రోజుల పాటు ఐసీయూలో ఉన్న రిజ్వాన్ పోరాటం స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరూ అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. 

 

ఇక పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ‘ఈ ఆటగాడు (రిజ్వాన్) తన దేశం కోసం ఆడి ఉత్తమ ఆటను ప్రదర్శించాడని మీరు నమ్ముతున్నారా..? ఎందుకంటే రెండ్రోజుల పాటు అతడు ఆస్పత్రిలో ఉన్నాడు. రిజ్వాన్.. నీ మీద గౌరవం ఎక్కువైంది. నువ్వు నిజమైన హీరోవి..’ అంటూ ట్వీట్ చేశాడు. పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్.. రిజ్వాన్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘నిజమైన యోధుడు’ అని రాసుకొచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios