Asianet News TeluguAsianet News Telugu

చక్రం తిప్పిన గంగూలీ: యూఏఈలో ఐపీఎల్ 13కి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐపీఎల్ నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి అనుమతినిచ్చింది.

govt of india has cleared staging of ipl in the uae from sep 19 to nov 10
Author
New Delhi, First Published Aug 2, 2020, 9:10 PM IST

కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐపీఎల్ నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి అనుమతినిచ్చింది. యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ జరుపుతామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చేసిన విజ్ఞప్తికి కేంద్రం పచ్చా జెండా ఊపింది.

సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు యూఏఈలో ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం అనుమతినిచ్చింది. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకున్న బీసీసీఐ.. కేంద్రాన్ని ఒప్పించడానికి ముమ్మర కసరత్తు చేసింది.

ఇది ఫలించడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు ఐపీఎల్ మ్యాచ్‌లు దేశానికి అవల జరిగాయి.

Also Read:ఐపీఎల్ కి అభిమానులకు ఎంట్రీ, ప్రభుత్వ అనుమతే తరువాయి..!

ఆటగాళ్లు, సిబ్బంది రక్షణే ఇప్పుడు కత్తిమీద సాములా తయారైంది. స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రోసిడింగ్‌లోని నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సి వుంటుంది. 

మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాల్సిన ఐపీఎల్‌ షెడ్యూల్‌ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంతో నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19న తొలి మ్యాచ్‌, నవంబర్‌ 8 ఫైనల్‌తో నూతన షెడ్యూల్‌ బీసీసీఐ రూపొందించిందన్న విషయం విదితమే. 

యూఏఈ ఎందుకంటే..? ఐపీఎల్‌ 13 సీజన్‌ మార్చి 29-మే 24న జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా తొలుత ఏప్రిల్‌ 15కు, తర్వాత నిరవధిక వాయిదా పడింది. అప్పట్నుంచి ఐసీసీ, ఏసీసీ టోర్నీలు వాయిదా పడేందుకు బీసీసీఐ ఎదురుచూసింది. 

దీంతో ఐపీఎల్‌ నిర్వహణకు 8 వారాల సమయం లభించింది. యుఏఈలో మూడు స్టేడియాల్లో ఐపీఎల్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. షేక్‌ జయేద్‌ క్రికెట్‌ స్టేడియం, అబుదాబి, దుబాయి, షార్జాలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మూడు స్టేడియాలను అద్దెకు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఐసీసీ అకాడమీకి సైతం బోర్డు అద్దెకు తీసుకునే యోచనలో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios