కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు సాహ్మ్భించిపోయిన క్రికెట్ 117 రోజుల తరువాత ఇంగ్లాండ్ విండీస్ విజ్డెన్ సిరీస్ తో ఆరంభమయింది. క్రికెట్ ఆరంభమయితే అయింది కానీ స్టేడియంలలోకి అభిమానులను మాత్రం అనుమతించడంలేదు. 

ఐపీఎల్‌ కూడా ఖాళీ స్టేడియాల్లో, అభిమానులు లేకుండా జరుగుతుందనే అందరూ అనుకుంటున్నారు. కానీ యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 2020లో అభిమానులను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. 

యుఏఈ ప్రభుత్వం అనుమతిస్తే అభిమానులకు ప్రవేశం కల్పిస్తామని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ చెప్పగా.. తాజాగా ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు ప్రధాన కార్యదర్శి ముబాషిర్‌ ఉస్మాని అదే విషయాన్ని వెల్లడించాడు. 

'భారత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పూర్తి స్టాండర్డ్‌ అపరేటివ్‌ ప్రొసీజర్స్‌తో యుఏఈ ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. ఐపీఎల్‌ను మా అభిమానులు ఆస్వాదించాలని మా భావన. కానీ ప్రభుత్వ నిర్ణయమే అంతిమం. 30-50 శాతం సామర్థ్యం సీట్లతో అభిమానులను అనుమతించేందుకు చూస్తున్నాం. మా ప్రభుత్వం అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాం. ఐపీఎల్‌కు మరో ఏడు వారాల సమయం ఉండటంతో మరింత మెరుగైన వాతావరణం ఉంటుందని భావిస్తున్నాం' అని ఉస్మాని తెలిపాడు.

మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాల్సిన ఐపీఎల్‌ షెడ్యూల్‌ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంతో నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19న తొలి మ్యాచ్‌, నవంబర్‌ 8 ఫైనల్‌తో నూతన షెడ్యూల్‌ బీసీసీఐ రూపొందించిందన్న విషయం విదితమే. 

యూఏఈ ఎందుకంటే..? ఐపీఎల్‌ 13 సీజన్‌ మార్చి 29-మే 24న జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా తొలుత ఏప్రిల్‌ 15కు, తర్వాత నిరవధిక వాయిదా పడింది. అప్పట్నుంచి ఐసీసీ, ఏసీసీ టోర్నీలు వాయిదా పడేందుకు బీసీసీఐ ఎదురుచూసింది. 

దీంతో ఐపీఎల్‌ నిర్వహణకు 8 వారాల సమయం లభించింది. యుఏఈలో మూడు స్టేడియాల్లో ఐపీఎల్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. షేక్‌ జయేద్‌ క్రికెట్‌ స్టేడియం, అబుదాబి, దుబాయి, షార్జాలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మూడు స్టేడియాలను అద్దెకు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఐసీసీ అకాడమీకి సైతం బోర్డు అద్దెకు తీసుకునే యోచనలో ఉంది.