కరోనా వైరస్ కారణంగా దేశంలో అన్ని రకాల శుభకార్యాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అంత్యక్రియల వంటి క్రతువులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇలాంటి పరిస్ధితుల్లో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి అంత్యక్రియలను నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. 

Also Read:నా బర్త్‌ డేకు అమ్మ ఇచ్చిన గిఫ్ట్... దీనికి వెల కట్టలేం: టెండూల్కర్

వివరాల్లోకి వెళితే.. ఒడిషాలోని జాజ్‌పూర్‌ జిల్లాకు చెందిన సరస్వతి పత్రా గత ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మధుమేహం, అధిక రక్తపోటుతో తీవ్రంగా ఇబ్బందిపడుతూ ఆసుప్రతిలో చేరింది.

అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆమె మృతదేహాన్ని ఒడిశాలోని స్వగ్రామానికి తరలించలేని పరిస్ధితి. ఈ పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్ స్వయంగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

‘‘ తన పిల్లలను కంటికి రెప్పలా చూసుకున్న సరస్వతి తన ఇంట్లో పనిమనిషి కాదు, ఆమె నా కుటుంబంలోని మనిషి. సరస్వతి అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్ధితులతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించాలనేదే తన సిద్ధాంతం. ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి ఇదే నా మార్గం. అది ఇండియా ఆలోచన, ఓం శాంతి అంటూ గంభీర్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

Also Read:ఎందరికో స్ఫూర్తి, కాలాన్ని ఆపగలడు: సచిన్‌కు క్రికెటర్ల పుట్టినరోజు శుభాకాంక్షలు

మానవత్వంతో పని మనిషి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్‌ను కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. జీవనోపాధి కోసం సొంత వూళ్లను వదలిపెట్టిన ఎంతోమంది పేదలకు గంభీర్ చర్య మానవత్వంపై విశ్వాసం పెంచుతుందని ప్రధాన్ ట్వీట్ చేశారు.