Asianet News TeluguAsianet News Telugu

T20 WorldCup: ఒకప్పుడు అమెజాన్ డ్రైవర్.. ఇప్పుడు టీ20 స్టార్.. స్కాట్లాండ్ స్టార్ గ్రీవ్స్ సక్సెస్ స్టోరీ

Chris Greaves:యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో స్కాట్లాండ్ తరఫున ఆడుతున్న క్రిస్ గ్రీవ్స్.. క్రికెట్ లోకి రాకముందు అమెజాన్ లో డ్రైవర్. వినియోగదారులకు వారి వస్తువులను అందజేసే ఒక ట్రక్ కు అతడు డ్రైవర్ గా పనిచేశాడు.

From amazon driver to T20 World cup star here is the journey of scotland all rounder chris greaves
Author
Hyderabad, First Published Oct 18, 2021, 12:55 PM IST

విధి విచిత్రమైనది. అది ఎవరిని ఏ సమయంలో ఎక్కడ ఎందుకు ఉంచుతుందో ఎవరికీ అర్థం కాదు. నిన్న కోటీశ్వరుడు రేపటి రోజున రోడ్డున పడొచ్చు. ఇవాళ కూటికి గతి లేని వాడు కూడా మరుసటి రోజున లక్షాధికారి కావచ్చు. అందుకే కష్టే ఫలి అంటారు. కష్టాన్ని నమ్ముకున్నవాళ్లు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరనేది నిరూపిత సత్యం. ఆ కష్టాన్నే నమ్ముకుని లైఫ్ లో సక్సెస్ అయినవాళ్లెందరో. అలాంటి కోవకే చెందుతాడు స్కాట్లాండ్ (Scotland) ఆల్ రౌండర్ క్రిస్ గ్రీవ్స్ (Chris Greaves). 

యూఏఈ (UAE) వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup 2021) లో స్కాట్లాండ్ తరఫున ఆడుతున్న క్రిస్ గ్రీవ్స్.. క్రికెట్ లోకి రాకముందు అమెజాన్ (Amazon) లో డ్రైవర్. వినియోగదారులకు వారి వస్తువులను అందజేసే ఒక ట్రక్ కు అతడు డ్రైవర్ గా పనిచేశాడు. ఇష్టం లేకున్నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా.. ఆ వృత్తిని స్వీకరించాడు గ్రీవ్స్. చిన్ననాటి నుంచి అతడికి క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ కు పుట్టినిల్లైన ఇంగ్లండ్ పక్కనే ఉండటం కూడా అతడిలో క్రికెట్ పై క్రేజ్ ను పెంచింది. 

ఇది కూడా చదవండి:T20 Worldcup: ఓమన్ జట్టులో హైదరాబాద్ క్రికెటర్.. కవాడిగూడ టు మస్కట్ దాకా సందీప్ ప్రయాణమిదే..

ఒకవైపు డ్రైవర్ గా పనిచేస్తూనే మరోవైపు క్రికెట్ సాధనను ముమ్మరం చేశాడు. ఇదే క్రమంలో స్థానిక టోర్నీల్లో అదరగొట్టడంతో అతడికి జాతీయ జట్టులో అవకాశం లభించింది. అంతే.. గ్రీవ్స్ జీవితమే మారిపోయింది. ఇక తాజాగా టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టు సభ్యులలో అతడి పేరు కూడా ఉంది. నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్.. గ్రీవ్స్ కు రెండో అంతర్జాతీయ మ్యాచ్. 

ఇది కూడా చదవండి:Yuvraj Singh Arrest: నిత్యం వివాదాల్లోనే.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన యువరాజ్ సింగ్

ఇక నిన్నటి మ్యాచ్ లో క్రిస్ గ్రీవ్స్ ఆడిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం జరిగిన గ్రూప్-బి తొలి రౌండ్ మ్యాచ్ లో బంగ్లా (Bangladesh) బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ ఒక దశలో 53 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన  క్రిస్ గ్రీవ్స్.. 28 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. జార్జ్ మున్నీ, మార్క్ వ్యాట్ తో కలిసి తన జట్టు 140 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

 

బ్యాటింగ్ తో పాటే బౌలింగ్ లోనూ గ్రీవ్స్ అదరగొట్టాడు. లక్ష్యం దిశగా సాగుతున్న బంగ్లాను కోలుకోలని  దెబ్బ తీశాడు. షకీబుల్ హసన్, ముష్పికర్ రహిమ్ లను ఔట్ చేసి స్కాట్లాండ్ కు విజయం సాధించిపెట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించినందుకు గాను గ్రీవ్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. 

ఇదిలాఉండగా.. గ్రీవ్స్ సామర్థ్యం గురించి స్కాట్లాండ్ కెప్టెన్ కోట్జెర్ మాట్లాడుతూ.. ‘ఇది అతడికి నమ్మశక్యం కాని రోజు. కానీ ఇది మాకు మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు.  గ్రీవ్స్ ఆట గురించి అతడిలోని సామర్థ్యంపై మాకు నమ్మకముంది. గ్రీవ్స్ ను చూసి గర్వపడుతున్నాను. అతడు ఇక్కడిదాకా రావడానికి చాలా త్యాగాలు చేశాడు. క్రికెట్ లోకి రాకముందు అతడు అమెజాన్ డ్రైవర్ గా పనిచేసేవాడు. ఇప్పుడు అతడు మా జట్టు తరఫున స్టార్ ఆటగాడు అయ్యాడు’ అని అన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios