Asianet News TeluguAsianet News Telugu

ఆ నిబంధనను టెస్టు క్రికెట్ లో కూడా అమలుచేయాలి.. అప్పుడే నో బాల్స్ తగ్గుతాయి.. డేల్ స్టెయిన్ సూచన

Dale Steyn New Suggestion: దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్  స్టెయిన్ ఆసక్తికర చర్చకు తెరతీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఉన్న ఆ నిబంధనను టెస్టు క్రికెట్ లో కూడా అమలుచేయాలని సూచించాడు. 

Free Hit For No ball In Test Cricket, Dale Steyn New Suggestion To Help Tailenders
Author
Hyderabad, First Published Jan 13, 2022, 2:55 PM IST

పరిమిత ఓవర్ల క్రికెట్ లో  బౌలర్లు నో బాల్స్ వేస్తే దానికి తర్వాత బంతిని ఫ్రీ హిట్ గా పరిగణిస్తారు. ఆ బంతికి రనౌట్ తప్ప  క్యాచ్ గానీ, ఎల్బీ గానీ ఉండదు. అయితే ఈ నిబంధనను ఇప్పటికి వన్డేలు, టీ20లలో మాత్రమే అమలు చేస్తుండగా తాజాగా దీనిని టెస్టులలో కూడా ప్రవేశపెట్టాలని  అంటున్నాడు  దక్షిణాఫ్రికా మాజీ పేసర్  డేల్ స్టెయిన్. దీని వల్ల అనవసరంగా విసిరే నో బాల్స సంఖ్య తగ్గడమే గాక లోయరార్డర్ బ్యాటర్లకు ఎంతో ఉపయోగకరమని స్టెయిన్ సూచించాడు.  ట్విట్టర్ వేదికగా ఈ  ట్వీట్ చేసిన ఈ మాజీ ప్రొటీస్ పేసర్.. ఆసక్తికర చర్చకు తెరతీశాడు. 

ట్విట్టర్ లో స్టెయిన్ స్పందిస్తూ.. ‘టెస్టు క్రికెట్ లో కూడా నో బాల్ కు ఫ్రీ హిట్ ఇవ్వాలి.. మీరేమంటారు..? ఇది కచ్చితంగా బౌలర్లకు (బ్యాటింగ్ చేస్తున్నప్పుడు) ఉపయోగపడుతుంది.  టెయిలెండర్లు ఓవర్ కు 8 నుంచి 9 బంతులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.  ఒక టెయిలెండర్.. టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ విసిరే ఆరు బంతులు తట్టుకుని నిలబడటమే గగనం..’ అంటూ ట్వీట్ చేశాడు. 

 

టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో కూడా బౌలర్లు పదుల సంఖ్యలో నోబాల్స్ వేస్తున్నారు. ముఖ్యంగా టెయిలెండర్లు బ్యాటింగ్ వచ్చినప్పుడు బౌలర్లు ఓవర్ కు రెండు,  మూడు నోబాల్స్ వేస్తున్నారు. యాషెస్ సిరీస్ లో కూడా ఇవి పునరావృతమవుతున్నాయి. టెయిలెండర్లు బంతిని పైకి లేపేందుకు అవకాశమిస్తూ.. వాళ్లను ఊరించేందుకు బౌలర్లు ఈ విధంగా బంతులు విసురుతున్నారా..? అని అనుమానాలు కూడా వస్తున్నాయి.  ఈ నేపథయంలో స్టెయిన్ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇక స్టెయిన్ ట్వీట్ పై ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. 

ఇక ఈ ట్వీట్ తో పాటు  స్టెయిన్.. ‘ఏదేమైనా సరే..  ఇక్కడ సీరియస్ టెస్టు మ్యాచ్ (ఇండియా-సౌతాఫ్రికా) జరుగుతున్నది. బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేశాడు’ అని మరో ట్వీట్ చేశాడు. 

 

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సులో బుమ్రా చెలరేగాడు.  23.3 ఓవర్లు వేసిన బుమ్రా.. 42 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. టెస్టులలో ఐదు వికెట్లు తీయడం  బుమ్రాకు ఇది ఏడోసారి కావడం గమనార్హం.  బుమ్రా విజృంభణతో సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో 210 పరుగులకు ఆలౌట్ అయ్యారు.  భారత్ కు 13 పరుగుల  స్వల్ప ఆధిక్యం దక్కింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. మూడో రోజు 27 ఓవర్లు ముగిసే పరికి నాలుగు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. కోహ్లి (16 నాటౌట్), రిషభ్ పంత్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 93 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios