ENG vs IND: భారీ ఆశలతో ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత్ కు భంగపాటు తప్పలేదు. టీమిండియా సారథి రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టుకు మరో దారుణ ఓటమి ఎదురైంది.
‘ప్రత్యర్థి మారినా మా జట్టు ఆటతీరు మారదు.. టీమిండియా ఇన్నాళ్లు చూసిన ఇంగ్లండ్ వేరు.. ఇప్పుడు చూడబోయే జట్టు వేరు..’ ఎడ్జబాస్టన్ టెస్టుకు ముందు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ చేసిన కామెంట్ అది. అనుకున్నట్టే చెప్పి మరీ దెబ్బకొట్టాడు స్టోక్స్. కానీ టీమిండియా మాత్రం ఈ టెస్టులో శాసించే స్థితి నుంచి వర్షం పడితే భాగుండు అన్న స్థితికి దిగజారిపోయి.. చివరికి దారుణంగా ఓటమి పాలవడానికి కారణాలేమిటి..? కోహ్లి పేలవ ఫామా..? టాపార్డర్ వైఫల్యమా..? బౌలర్ల తడబాటా..? ఫీల్డర్లు క్యాచ్ లు జారవిడవడమా..?
బర్మింగ్హోమ్ వేదికగా ముగిసిన టెస్టులో భారత జట్టు ఓటమికి జట్టు సెలక్షనే కారణమని కొందరంటుండగా.. పరిస్థితులు అనుకూలించలేదని సరిపెట్టుకునే అభిమానులూ ఉన్నారు. మరికొందరేమో విరాట్ కోహ్లితో పాటు టాపార్డర్ వైఫల్యం అని వాపోతున్నారు.
సమిష్టి వైఫల్యం..
క్రికెట్ సమిష్టిగా ఆడే ఆట. అది ఏ ఒక్కరి వల్లో గెలిచేది కాదు.. ఏ ఒక్కరి వల్లో ఓడేది కాదు. మరి ఈ టెస్టులో టీమిండియా సమిష్టిగా విఫలమైందా..? అంటే సమాధానం అవుననే అనిపించక మానదు. తొలి ఇన్నింగ్స్ లో శుభమన్ గిల్, పుజారా, హనుమా విహారి, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ చేసిన పరుగులు 76.. రెండో ఇన్నింగ్స్ లో ఇదే జాబితాలో పుజారా ఒక్కడే కాస్త మెరుగ్గా (66) ఆడాడు. మిగిలినవారిది అదే పంథా. మిగతా నలుగురు రెండో ఇన్నింగ్స్ లో చేసిన రన్స్ 54. భారత బ్యాటింగ్ భారం మోసింది రెండు ఇన్నింగ్స్ లలో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా. ఆల్ రౌండర్ స్థానంలో అశ్విన్ ను కాదని శార్దూల్ ఠాకూర్ ను బరిలోకి దింపింది టీమిండియా యాజమాన్యం. ఈ టెస్టుల రెండు ఇన్నింగ్స్ లలో కలిపి బ్యాటింగ్ లో అతడు చేసిన పరుగులు 5.. తీసిన వికెట్లు 1.
ఫీల్డింగ్..
తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అదే సమయంలో జానీ బెయిర్ స్టో ను కోహ్లి గెలికాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన బెయిర్ స్టో.. కసిగా సెంచరీ (106) బాదాడు. అంతకుముందు శార్దూల్ ఠాకూర్ బెన్ స్టోక్స్ ఇచ్చిన క్యాచ్ ను మిస్ చేశాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో హనుమా విహారి.. బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్ ను నేలపాలు చేశాడు. దాని ఫలితం భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. క్యాచ్ లను జారవిడవడంతో పాటు బౌండరీలను ఆపలేకపోయారు మన ప్రపంచ స్థాయి ఫీల్డర్లు..
జట్టు సెలక్షన్..
‘ఐపీఎల్ ప్రదర్శనల ద్వారా జట్టును ఎంపిక చేశారా..?’ ఇంగ్లాండ్ తో రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు వినిపించిన కామెంట్ ఇది. ముఖ్యంగా గిల్, ఠాకూర్ ల ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అశ్విన్ ను కాదని శార్దూల్ ను ఎంపిక చేయడమేంటని అభిమానులు బీసీసీఐ పై ధ్వజమెత్తారు. రోహిత్-రాహుల్ లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ ను కాదని గిల్ ను ఓపెనింగ్ కు పంపినా అతడు విఫలమ్యాడు.
బౌలింగ్..
తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత సీమర్లు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తేలిపోయారు. నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్లకు అనుకూలించిన పిచ్.. భారత బౌలింగ్ దళానికి ఎందుకు అనుకూలించలేదు. గత కొద్దికాలంగా కనీసం హాఫ్ పెంచరీ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు.. బుమ్రా, సిరాజ్, షమీ ల బౌలింగ్ లో అలవోకగా బౌండరీలు బాదారు. ఇక రూట్-బెయిర్ స్టో ల బాదుడుకు ఈ పేస్ త్రయానికి కండ్లు బైర్లుగమ్మాయి.
మారని కోహ్లి..
2019 నవంబర్ లో కోహ్లి టెస్టులలో 27వ సెంచరీ నమోదుచేశాడు. అదే సమయానికి టెస్టులలో ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి రూట్ చేసినవి 16 శతకాలు. గత రెండున్నరేండ్లలో రూట్ 11 సెంచరీలతో చెలరేగాడు. మరి మన కోహ్లి..? ఎవరు ఔనన్నా కాదన్నా ఈ టెస్టు వైఫల్యానికి కోహ్లి కూడా కారణమనేవాళ్లు కూడా లేకపోలేదు. సారథి రోహిత్ శర్మ వంటి సీనియర్ లేని పక్షంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కోహ్లి.. ఈ టెస్టులో చేసిన పరుగులు 31. ఒకవైపు తనకంటే ఎన్నో రెట్లు దూరంగా ఉన్న రూట్.. ఇప్పుడు తనను అధిగమిస్తే కోహ్లి మాత్రం వరుసగా విఫలమవుతున్నా ఇంకా గత రికార్డులను చూపించుకుంటూ టీమ్ లో కొనసాగడం ఎంతవరకు భావ్యమని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక బెయిర్ స్టో తో స్లెడ్జింగ్ చేసి టీమిండియా ఓటమిలో పాలుపంచుకున్నాడని కోహ్లిపై ఫైర్ అయ్యే ఫ్యాన్స్ లేకపోలేదు.
రోహిత్ లేకుండా గెలవలేమా..?
గత నవంబర్ లో టీమిండియా సారథ్య పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న ఏ మ్యాచ్ లోనూ భారత జట్టు ఓడలేదు. న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక లపై భారత్ నెగ్గింది. ఇదే సమయంలో అతడి గైర్హాజరీలో ఈ ఏడాది సఫారీ సిరీస్ లో ఓడింది. ఇటీవలే స్వదేశంలో సఫారీలతో ముగిసిన తొలి రెండు టీ20లలో ఓటమే వెక్కిరించింది. ఎడ్జబాస్టన్ టెస్టులో కూడా అదే ఫలితం రిపీటయ్యింది..
