ధోని ప్రదర్శనపై వరల్డ్ కప్ నుంచి కూడా మొదలైన విమర్శలు ఇప్పట్లో ఆగేవిలా కనపడడం లేదు. వయసు మీదపడిపోతుందంటూ ధోనిని సాగనంపడానికి ధోని వ్యతిరేకులు ప్రయత్నిస్తుంటే, ధోని ఫాన్స్ మాత్రం ధోని కాకపోతే ఇంకెవరంటూ సవాల్ విసురుతున్నారు. 

దానితోనీపాటు ధోని ప్లేస్ లో ఇంకో కీపర్ ఎవరు అనేదానిపై కూడా మల్లగుల్లాలు పడుతున్నారు టీం ఇండియా సెలెక్టర్లు. ధోని కేవలం కీపర్ గానే కాకుండా, ఒక ఫినిషర్ గా, కెప్టెన్ గా, అన్నిటికంటే ముఖ్యంగా ఒక స్ట్రాటెజిస్ట్ గా అతని పాత్ర అమోఘం. అతని జడ్జిమెంట్ ఎంతలా ఉంటుందంటే, డిఆర్ఎస్ పద్ధతిని ముద్దుగా ధోని రివ్యూ సిస్టం అని పిలుచుకునేంత. 

ధోని రిటైర్మెంట్ పై ఎప్పటికప్పుడు కొత్త వాదనలు వినపడుతూనే ఉన్నాయి. వాదనలు వచ్చినప్పుడల్లా ఎవరు అనే ప్రశ్నకు భారత టీం మానేజ్మెంట్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. కొన్ని రోజులు పంత్ ను ధోనికి బదులు టీం లోకి తీసుకొద్దాము అనుకోగానే, పంత్ తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అతనికి వరుస అవకాశాలిచ్చినప్పటికీ అతను మాత్రం ఇంకా కుదురుకున్నట్టుగా కనపడడం లేదు. 

Also read: సంజు శాంసన్ ఎంపిక... పంత్ కు లక్ష్మణ్ చురకలు

సంజు శాంసన్ ని ఇప్పుడు ప్రస్తుత వెస్ట్ ఇండీస్ తోని సిరీస్ లో శిఖర్ ధావన్ బదులుగా తీసుకున్నారు. గంగూలీ బీసీసీఐ చైర్మన్ అయినప్పటినుండి ధోని విషయమై ఏమి తేలుతుందో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో,  ధోని భవితవ్యంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు. ధోని భవిష్యత్తు క్రికెట్‌ గురించి తమకు పూర్తి స్పష్టత ఉందని, కానీ ఆ విషయాలను బహిరంగ వేదికలపై పంచుకోలేమన్నాడు.   ధోని గురించి సెలక్టర్లకు ఒక అంచనా ఉందన్నాడు టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.  

టీం ఇండియా కు ధోని ఒక అసాధారణ క్రికెటర్ గా అభివర్ణించిన గంగూలీ, కొన్ని విషయాలు బయటకు పొక్కకుండా లోపల ఉండడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. అది కూడా పారదర్శకతలో భాగమేనని గంగూలీ వ్యాఖ్యానించాడు. 

ఇటీవల ధోని మాట్లాడుతూ, 2020 జనవరి తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానని అన్నాడు. జనవరి వరకూ వెయిట్ చేయండి, అప్పటివరకూ తనను ఏమీ అడగవద్దని ధోని అభ్యర్థించాడు . 

Also read: వార్నర్ ట్రిపుల్ సెంచరీ... పింక్ బాల్ చరిత్రలో నూతన రికార్డు

ఇక ధోని ఆ మాటనడంతోనే ఇక అందరూ తమ తమ ఊహలకు పని చెప్పారు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ ఆడిన తర్వాత ధోని రిటైర్మెంట్‌ ఉంటుందని సోషల్ మీడియా ఒక అంచనాకు వచ్చింది. 

ఐపీఎల్‌ సీజన్‌ తర్వాతే ధోని క్రికెట్‌ భవిష్యత్తు గురించి సంపూర్ణ చిత్రం ఆవిష్కృతమవుతుందని కోచ్‌ రవిశాస్త్రి కూడా వెల్లడించాడు. వన్డే వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత జట్టుకు ధోని అందుబాటులో లేడు. విశ్రాంతి తీసుకుంటూ ఇంటి వద్దనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. 

కూతురుతో సరదాగా ఉన్న వీడియోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు. రాంచి టెస్టులో ధోని స్టేడియం కి వచ్చి టీం సహచరులతో ఆహ్లాదంగా గడిపిన విషయం తెలిసిందే.