భారత్‌, ఇంగ్లాండ్‌ తర్వాత అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు ఆస్ట్రేలియా. ఐసీసీ బిగ్‌-3 సభ్యుల్లో ఒక బోర్డు. ఒక్క ప్రసార హక్కుల ఒప్పందంతోనే ఏకంగా రూ. 6 వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న ఏకైక బోర్డు!. ఆటగాళ్లకు సైతం అత్యధికంగా వేతనాలు అందిస్తూ, ఆదర్శంగా నిలిచింది. 

కానీ కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కరాళ నృత్యానికి సీఏ పూర్తిగా చితికిపోయింది. బలమైన మార్కెట్‌ లేని వెస్టిండీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి బోర్డులు ఇబ్బంది పడటంలో అర్థం ఉంది. ఆస్ట్రేలియా ఏడాదిలో ఓ సీజన్‌ క్రికెట్‌ నిలిచిపోయినంతనే, అప్పుల కోసం బ్యాంకుల చుట్టు తిరగటం, ఉద్యోగులను సెలవులో పంపించటం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

1500 కోట్ల అప్పు కోసం బ్యాంకుల సంప్రదించినప్పుడు, క్రికెట్‌ ఆస్ట్రేలియా నిజంగానే ఆ పని చేసిందా? అని ఆలోచించిన వారే ఎక్కువ. అందుకు కారణం, ఆర్థికంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంతో బలమైనది. ఓ మూడు నెలల క్రికెట్‌ సీజన్‌ నిలిచిపోతే ఇబ్బందిపడే దుస్థితి సీఏకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇదే అందరి నమ్మకం. నిజానికి క్రికెట్‌ ఆస్ట్రేలియాది సైతం అదే విశ్వాసం!. 

కరోనా వైరస్‌ క్రికెట్‌పై పంజా విసరడానికి ముందే, షేర్‌ మార్కెట్‌పై కరాళ నృత్యం చేసింది. రోజు రోజుకు మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఆదాయంలో అధిక మొత్తాలను షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఒక్కసారిగా మీదపడిన నష్టాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. 

క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి అదే కారణం. ముంచిన షేర్‌ మార్కెట్‌ పెట్టుబడి : ఆస్ట్రేలియా పత్రికా కథనాల ప్రకారం సీఏ షేర్‌ మార్కెట్‌లో సుమారు రూ. 500 కోట్లు పెట్టుబడులు పెట్టింది.

కరోనా మహమ్మారి కష్టకాలంలో సీఏ గరిష్ట నష్టాలను చవిచూసింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా వద్ద నగదు కేవలం రూ.124.64 కోట్లే ఉంది. వరుసగా మార్కెట్‌ రికార్డు నష్టాలను నమోదు చేయటం, ఆదాయంలో అధిక భాగం ఈక్విటి పెట్టుబడుల్లో ఉండటం క్రికెట్‌ ఆస్ట్రేలియాకు చేటు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి ఇదే అసలైన కారణం. 

బ్యాంకులకు జీ హుజూర్.... 

కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ముందే చవిచూసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆలస్యం చేయకుండా బ్యాంకులను ఆశ్రయించింది. రూ. 1500 కోట్ల అప్పు ఆర్థించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆరేండ్ల కాలానికి ఫోక్స్‌టెల్‌, సెవెన్‌లతో బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. మీడియా హక్కుల తనఖాతో అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు సుమఖత వ్యక్తం చేశాయి. 

ఇదే సమయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్వహణ ఖర్చు, ఇతర వ్యయాలను తగ్గించుకోవాలని బ్యాంకులు హుకుం జారీ చేశాయి. ఖర్చు తగ్గింపు నిబంధన పాటిస్తేనే అప్పు ఇస్తామని ఆల్టిమేటం జారీచేశాయి. 

దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ఉద్యోగుల్లో 80 శాతం మందిని సెలవులో పంపించింది. వాటాదారు పరిస్థితి చూసి భయం : 2018లో ఫోక్స్‌టెల్‌, సెవెన్‌లతో ఆరు సంవత్సరాల కాల వ్యవధికి రూ. 5700 కోట్ల (750 మిలియన్‌ డాలర్లు) మెగా ఒప్పందం కుదిరింది. 

ఒప్పందం కుదిరిన నాటి నుంచి ఇప్పటివరకూ మీడియా భాగస్వామి క్రమం తప్పకుండా చెల్లింపులు చేసింది. ఎక్కడా ఆలస్యం కాలేదు. కానీ ఇటీవల ఫోక్స్‌టెల్‌ తన ఉద్యోగుల్లో 200 పైచిలుకు మందిని తొలగించింది. 

ఇందులో అధిక శాతం మంది స్పోర్ట్స్‌ కవరేజీ చూసేవారే. దీనితో పాటు ఆస్ట్రేలియా పాపులర్‌ సాకర్‌ లీగ్‌ ఏ-లీగ్‌కు సైతం ఫోక్స్‌టెల్‌ మీడియా భాగస్వామి. కానీ ఏ-లీగ్‌కు చెల్లించాల్సిన వాటా రూ. 76 కోట్లు (10 మిలియన్‌ డాలర్లు) ఇంకా చెల్లించలేదు. 

ఆర్థిక ఒత్తిడి నెలకొన్న వాతావరణంలో తర్వాత తన వంతే అని సీఏ అంచనా వేసుకుంది. ఫోక్స్‌టెల్‌ మీడియా హక్కుల వాటా చెల్లింపు వాయిదా, రద్దు చేసుకుంటే తన పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని ఊహించింది. 

టీ20 వరల్డ్‌కప్‌ ఫోబియా : స్వీయ కారణాలకు అదనంగా టీ20 వరల్డ్‌కప్‌ ఆతిథ్యం క్రికెట్‌ ఆస్ట్రేలియాను మరింత కలవర పెడుతోంది. ఫిబ్రవరిలో మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను అట్టహాసంగా నిర్వహించిన సీఏ, అక్టోబర్‌లో మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ కోసం మరింత ఘనంగా ఏర్పాట్లు చేసింది. 

స్వదేశీ వేసవి క్రికెట్‌ సీజన్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా.. టీ20 వరల్డ్‌కప్‌ రద్దుగా ముగిస్తే మరింత భారీ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. ఐసీసీ నుంచి అందే నిర్వహణ ఖర్చు, టీ20 వరల్డ్‌కప్‌ ఆదాయంలో వాటా నష్టపోవాల్సి ఉంటుంది. 

ఏప్రిల్‌ 30 లోగా ఆస్ట్రేలియా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులు పూర్తి చేయాలి. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో కూరుకుంది. ఉద్యోగుల వేతనాల కోత, బలవంతపు సెలవుల నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు బ్యాంకుల నుంచి రానున్న రూ.1500 కోట్లతో సీఏ తాత్కాలికంగా సాంత్వన పొందే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా క్రికెట్‌ బోర్డు ఆదాయాన్ని షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెట్టి నష్టాలు చవిచూడటంపై ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకం