హైదరాబాద్: ఈ ఏడాది మాత్రమే కాదు, ఈ దశాబ్దం కూడా మరో రెండు రోజుల్లో ముగుస్తోంది. కొత్త సంవత్సరంలోకి మాత్రమే కాకుండా కొత్త దశాబ్దంలోకి కూడా అడుగుపెట్టబోతున్నాం. ఈ స్థితిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ చేసిన ఓ ట్వీట్ టాకింగ్ పాయింట్ అయింది.

విరాట్ కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ చేసిన ట్వీట్ ను ఈ దశాబ్దం చెత్త ట్వీట్ గా అభివర్ణిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.. ఏడేళ్ల క్రితం టెస్టు, వన్డే సిరీస్ లు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ సందర్భంగా 2012 జనవరి 6వ తేదీన ట్విట్టర్ లో సంజయ్ మంజ్రేకర్ ఓ పోస్టు పెట్టాడు. 

"నేనైతే వీవీయస్ లక్ష్మణ్ ను తప్పించి.. తర్వాతి టెస్టుకు రోహిత్ ను ఎంపిక చేస్తా. అయితే విరాట్ కోహ్లీకి మరో టెస్టు చాన్స్ ఇస్తా. ఎందుకంటే అతను ఏలాగూ ఎక్కువ కాలం టెస్టు జట్టులో కనబడడు" అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. 

టెస్టుల్లో విరాట్ కోహ్లీకి భవిష్యత్తు లేదని సంజయ్ మంజ్రేకర్ భావించి అలా ట్వీట్ చేశాడు. అయితే, విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా భారత జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. విజ్డెన్ ప్రకటించిన ఈ దశాబ్దం టాప్ 5 క్రికెటర్లలో విరాట్ కోహ్లీ పేరు కూడా చోటు చేసుకుంది. సరైన అంచనా లేకుండా కోహ్లీపై మంజ్రేకర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం అత్యంత చెత్త ట్వీట్ గా ట్రెండ్ అవుతోంది.