క్రికెట్ ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. ఇండియన్ క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ 2020 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మార్చి నెలలలో ప్రారంభం కానుందనే ప్రచారం కూడా ఇప్పటికే మొదలైంది. అయితే... ఇప్పుడు తాజాగా తెలిసిన సమాచారం ఏమిటంటే... ఐపీఎల్ సీజన్ మర్చిలో ప్రారంభమయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే...  13వ సీజన్ వచ్చే నెల 29వ తేదీ నుంచి మొదలవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై ఇప్పటి వరకు  బీసీసీఐ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ అనుకున్న షెడ్యూల్ కంటే మరింత ఆలస్యంగా మొదలు కానుందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read జడేజా సూపర్ త్రో... ఔరా అంటున్న నెటిజన్లు...

వాస్తవానికి ఐపీఎల్ 2020 మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాల్సి ఉంది. అయితే మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో వరుసగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండటంతో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉండరు. ఈ క్రమంలోనే ఐపీఎల్ షెడ్యూల్‌లో పలు మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోందట. 

ఇందుకు గానూ ఐసీసీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒక్కసారి చర్చలు పూర్తి కాగానే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా స్పష్టం చేశారు. అంతేకాకుండా ముందుగా అనుకున్న ఆల్ స్టార్స్ మ్యాచ్ కూడా లేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ ప్రచారాలపై బీసీసీఐ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.