BCCI prize money for team India : టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐసీసీ నుంచి భారీ ప్రైజ్ మనీ అందుకున్న టీమిండియా ఆటగాళ్లు, సిబ్బందిపై ఇప్పుడు బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది.
BCCI prize money for team India : 17 ఎళ్ల తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. చివరిసారి 2007లో ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచ కప్ తొలి ట్రోఫీని అందుకోగా, ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు రెండో టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఈ మెగా టోర్నీలో ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టు $2.45 మిలియన్లు (రూ. 20.40 కోట్లు) అందుకుంది. అలాగే, అదనపు బోనస్ లు కలుపుకుని భారీగానే అందుకుంది. అయితే, ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ టైటిల్ ప్రైజ్ మనీకి 6 రెట్లు అధికంగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లు, సిబ్బందిపై కాసుల వర్షం కురిపించింది.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024ను గెలుచుకున్నందుకు గానూ టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల భారీ ప్రైజ్ మనీని జూన్ 30న (ఆదివారం) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. భారత పురుషుల క్రికెట్ జట్టు వారి 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించుతూ ఛాంపియన్ గా నిలిచింది. శనివారం బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ సెక్రటరీ జై షా విజేత జట్టుకు రూ.125 కోట్ల బహుమతిని వెల్లడించారు. టీమిండియా అత్యుత్తమ విజయానికి సహకరించినందుకు ఆటగాళ్లను, సిబ్బందిని ఆయన అభినందించారు.
"ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో గెలిచినందుకు గాను టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను" అని జై షా తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. "టోర్నమెంట్ అంతటా జట్టు అసాధారణమైన ప్రతిభ, సంకల్పం-క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. ఈ అత్యుత్తమ విజయానికి ఆటగాళ్లు, కోచ్‌లు-సహాయక సిబ్బందికి అభినందనలు" అని జైషా పేర్కొన్నారు.
కాగా, గతంలో జైసా చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. "ప్రపంచ కప్‌పై నా ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు" అని షా ఫిబ్రవరి 2024లో చెప్పాడు. "2023లో భారత్ 10 మ్యాచ్‌లు నేరుగా గెలిచి ప్రపంచకప్ గెలవలేదు, కానీ మేము హృదయాలను గెలుచుకున్నాము. కానీ నేను ఒక వాగ్దానం చేయాలనుకుంటున్నాను... 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో బార్బడోస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుస్తుందని" జైషా అన్నారు.
