Rohit Sharma: అనుకున్నదే జరిగింది. భారత వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు.  దక్షిణాఫ్రికా తో టెస్టు సిరీస్ కు జట్టును ఎంపికచేసిన బీసీసీఐ.. పనిలో పనిగా పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్య బాధ్యతలను మొత్తం హిట్  మ్యాన్ కే అప్పగించింది. ఇక  విరాట్ కోహ్లీ.. టెస్టులకు మాత్రమే  కెప్టెన్. 

త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న Team India టెస్టు జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. కీలక పర్యటన నేపథ్యంలో భారీ మార్పులు తప్పవని ఊహించినట్టే బీసీసీఐ జట్టును ప్రకటించింది. టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న Ajinkya Rahaneకు బిగ్ షాక్ ఇచ్చింది. అతడిని South Africa టూర్ కు ఎంపిక చేసినా వైస్ కెప్టెన్సీని మాత్రం తొలిగించింది. గాయాలపాలైన రవీంద్ర జడేజా, శుభమన్ గిల్, అక్షర్ పటేల్ లకు విశ్రాంతినిచ్చింది. అన్నింటికంటే ముఖ్యమైన అంశమేమిటంటే.. టీమిండియా టీ20 సారథి Rohit Sharma ఇకపై వన్డేలకు కూడా సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా చేసింది. 

టెస్టు జట్టు చూసుకుంటే.. న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన సిరీస్ లో పక్కనబెట్టిన తెలుగు కుర్రాడు Hanuma Vihari తిరిగి జట్టుతో చేరాడు. T20 World Cup తర్వాత విరామం తీసుకున్న మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా లు తిరిగి జట్టుతో చేరారు. రవిచంద్రన్ అశ్విన్ కు తోడుగా జయంత్ యాదవ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. డిసెంబర్ 26న తొలి టెస్టు మొదలుకానున్నది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా టీమిండియా.. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు ఆడనున్నది. 

View post on Instagram

ఇక వరుసగా విఫలమవుతున్న అజింకా రహానే, ఛతేశ్వర్ పుజారాలకు సెలెక్టర్లు మరో అవకాశమిచ్చారు. ఈ ఇద్దరూ ఈ సిరీస్ లో విఫలమైతే ఇక తర్వాత వాళ్ల భవిష్యత్ అంధకారమే. రహానేను జట్టులోకి ఎంపిక చేసినా.. అతడి వైస్ కెప్టెన్సీని తొలగించి దానిని రోహిత్ శర్మకు ఇచ్చారు. 

18 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. నలుగురు ప్టాండ్ బై ప్లేయర్లను కూడా ప్రకటించింది. నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వస్వల్ల లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది. 

సౌతాఫ్రికాతో టెస్టులకు భారత జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింకా రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్ధుల్ ఠాకూర్ 

స్టాండ్ బై ప్లేయర్లు : నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వస్వల్ల

Scroll to load tweet…

రోహిత్ కు వన్డే కెప్టెన్సీ :

అనుకున్నదే జరిగింది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న Virat Kohli.. తాజాగా వన్డే కెప్టెన్సీ నుంచి కూడా నిష్క్రమించాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ మొత్తానికి హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే సారథిగా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది ఆసీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ తో పాటు 2023లో వన్డే ప్రపంచకప్ కూడా ఉన్న నేపథ్యంలో అప్పటివరకు రోహిత్ ను సిద్ధం చేసేందుకు సెలెక్టర్లు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. టీ20, వన్డేలకు సారథిగా ఉండే రోహిత్.. టెస్టులకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక విరాట్ కోహ్లీ.. టెస్టులకు మాత్రమే సారథిగా ఉండనున్నాడు.