మ్యాచులో సిక్సర్ కొడితే అభిమానులకు వచ్చే మజానే వేరు. ఓవర్లో ఒక్క సిక్స్ పడితేనే అలా ఉంటే.... ఒకే ఓవర్లో 6 సిక్సులు కొడితే ఆ ఆనందం అనుభూతి ఎలా ఉంటుందో భారతీయులకు రుచి చూపించాడు యువరాజ్ సింగ్. ప్రపంచంలో గ్యారీ సోబర్స్,గిబ్స్ ఇలా చాలా మంది వ్యక్తులు 6 సిక్సర్లు కొట్టినప్పటికీ...యువరాజ్ సింగ్ సిక్సులు ఇచ్చే కిక్కే వేరు. 

ఆ మ్యాచులో ఫ్లింటాఫ్ తో గొడవ అనంతరం యువరాజ్ బాదిన బాదుడు ఎవరూ మర్చిపోలేరు. బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కి ఆ రాత్రి కాళరాత్రే అయి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలైనా మనకు అది ఇంకా రోమాంచితమైన వీడియోనే. ఎన్నిసార్లు చూసినా తిరిగి తిరిగి దాన్ని చూస్తూనే ఉంటాము. 

Also read: పాత మొబైల్ ఫోన్లతో కోహ్లీ చిత్రం సృష్టించిన ఫ్యాన్: వీడియో

ఇప్పుడు ఇదే తరహాలో మరో యువ క్రికెటర్‌ చెలరేగిపోయాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ లియో కార్టర్‌ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన అతికొద్దిమంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ కుర్రాడు కూడా టి 20లోనే ఇలా బాదడడం విశేషం.

న్యూజిలాండ్‌ సూపర్‌ స్మాష్‌ టీ20 లీగ్‌లో భాగంగా కాంటర్‌బరీ-నార్తర్న్ నైట్స్‌ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచులో కాంటర్‌బరీ బ్యాట్స్‌మన్‌ లీయో కార్టర్‌ విశ్వరూపం ప్రదర్శిస్తూ శివాలెత్తాడు.  29 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  

ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో లియో కార్టర్‌ ఆరు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు స్పిన్నర్‌ అంటోన్‌ డెవసిచ్ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా విజృంభించాడు. 

ఆ ఓవర్‌లో తొలి బంతిని బ్యాక్‌ వర్డ్ స్వ్కేర్‌  లెగ్‌ మీదుగా సిక్స్‌ గా మలచగా... రెండు, మూడు బంతుల్ని మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్లుగా బౌండరీ ఆవలికి తరలించాడు. 

నాలుగో బంతిని డీప్‌ స్వ్కేర్‌ లెగ్‌ వైపుగా  స్టాండ్స్ లోకి సాగనంపాడు. ఐదో  బంతిని లాంగాన్‌ మీదుగా సిక్సర్ బాదాడు. ఓవర్లో చివరి బంతి, ఆరో బంతిని మరో మారు డీప్‌ స్క్వేర్‌ మీదుగా ఆరు రన్నుల కోసం బౌండరీ గీత దాటించాడు. 

ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా నార్తర్న్ నైట్స్‌ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని కాంటర్‌బరీ 18.5 ఓవర్లలోనే  అది కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఇప్పుడు లియో కార్టర్‌ కొట్టన సిక్సర్ల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.