కరోనా తీవ్రత దృష్ట్యా ప్రపంచంలోని అన్ని రకాల క్రీడలకు సంబంధించిన మెగా టోర్నీలు వాయిదాపడటమో, రద్దవ్వడమో జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్ అలెక్స్ క్యారీ ఐపీఎల్ వాయిదాపై స్పందించాడు. కరోనా తీవ్రతను చూస్తుంటే ఈ ఏడాది ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

Also Read:ఆ పాకిస్తాన్ క్రికెటర్లకు పచారీ కోట్లే కరెక్ట్: రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో క్రికెట్ ఆడటం ఆనందంగా ఉందని ఐపీఎల్‌లో ఇదే తన తొలి సీజన్ అని తెలిపాడు. రికీ పాంటింగ్‌తో కలిగి ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని క్యారీ చెప్పాడు.

అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాదనిపిస్తోందని.. కానీ త్వరలో సాధారణ పరిస్ధితులు చోటు చేసుకుంటాయని క్యారీ ఆకాంక్షించాడు. తర్వాత ఐపీఎల్, టీ 20 ప్రపంచకప్‌ జరుగుతుందని భావిస్తున్నానని, దాని కోసం మనం వేచి ఉండాలని అలెక్స్ చెప్పాడు.

Also Read:అనుష్క ఫోర్ కొట్టు వీడియోపై చాహల్ స్పెషల్ రిక్వెస్ట్

కరోనా కారణంగా కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నానని... క్రికెట్‌కు ఇది కఠిన ఏడాదని ప్రస్తుతం అందరూ ఇళ్లలోనే ఉండటం మంచిదని అన్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అలెక్స్‌ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.40 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సిన 13న సీజన్‌ను తొలుత ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. మే 3 వరకు పొడిగించడంతో ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.