పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వివాదాలకు అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధం కొనసాగుతూనే ఉంది కూడా. ఫిక్సింగ్ వివాదాలకు ఆ దేశ క్రికెటర్లకున్న విడదీయలేని బంధం పై అనేక జోకులు పేలడం మనం చూసాము కూడా. తాజాగా ఇలా కళంకిత క్రికెటర్లను జాతీయ జట్టులోకి తీసుకోవడంపై పాక్ దిగ్గజ ఆటగాడు రమీజ్ రాజా ఫైర్ అయ్యాడు. 

పేస్‌ బౌలింగ్‌లో ప్రపంచ శ్రేణి సీమర్లను అందించిన ఘనత పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుది. ఎంతో మంది నాణ్యమైన పేసర్లు స్వింగ్‌ అస్త్రంతో ప్రపంచ బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. 

అయితే మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన కళింకిత క్రికెటర్లను తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవటం పాకిస్థాన్‌ క్రికెట్‌ ప్రతిష్ట, జాతీయ జట్టు వాతావరణాన్ని దెబ్బతీసిందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా అభిప్రాయపడ్డారు. 

'సెలక్టర్లకు నాణ్యమైన ప్రత్యామ్నాయ వనరులు లేని విషయాన్ని అర్థం చేసుకోగలను. కానీ కొంత మంది (మహ్మద్‌ ఆమీర్‌) క్రికెటర్లను తిరిగి తీసుకోవటం పాక్‌ క్రికెట్‌ను దెబ్బతీసింది. ఈ విషయంలో నన్ను అడిగితే, కళింకిత పాక్‌ క్రికెటర్లు పచారీ కొట్లు (కిరాణ దుకాణం) పెట్టుకోవాలని చెబుతాను. 

కళింకిత క్రికెటర్‌ షార్జీల్‌ ఖాన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలనే చర్చ జరుగుతోంది. ఇది ఏమాత్రం మేలు చేసే నిర్ణయం కాబోదు. పాకిస్థాన్‌ క్రికెట్‌ ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది' అని రమీజ్‌ రాజా అన్నారు. 

పాకిస్థాన్‌ యువ సంచలనం బాబర్‌ ఆజామ్‌కు విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌లను దాటిపోయే సత్తా, సామర్థ్యం ఉన్నాయి. బాబర్‌ నైపుణ్యంపై ఎవరికీ అనుమానం లేదు. కానీ కళింకిత క్రికెటర్లతో కూడిన వాతావరణం అతడికి ఉపయుక్తం కాదు. 

యువ క్రికెటర్లను టీ20 ఫార్మాట్‌లోకి తీసుకు రావటంపై దృష్టి నిలపాలని చీఫ్‌ సెలక్టర్‌, చీఫ్‌ కోచ్‌ మిస్బావుల్‌ హాక్‌కు రాజా సూచించారు. సీనియర్‌ క్రికెటర్లు షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌ పట్ల ఎంతో గౌరవం ఉంది. దేశానికి సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించారు. వారి స్థానంలో యువ క్రికెటర్లను ఎంచుకోవటం సెలక్షన్‌ కమిటీ చేయాల్సి ఉందని రమీజ్‌ తెలిపారు.