కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కంటే ముందే తన సతీమణి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మతో తన ప్రత్యేక ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. 

దీంతో ఈ ప్రేమ‌ప‌క్షులు ఇప్ప‌డు ఇంట్లోనే ఆనందంగా  గ‌డుపుతున్నారు. వీలుచిక్కినప్పుడల్లా సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లోకి వస్తున్నారు.

ఇటీవల వారికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలను విరుష్క జోడీ అభిమానులతో పంచుకున్నారు. ఒక దాంట్లో అనుష్క.. కోహ్లీ జుట్టుకూడా కత్తిరించింది. ఆ తర్వాత వారిద్దరూ మోనోపోలీ గేమ్ ఆడామంటూ వాటి ఫోటోలు షేర్ చేశారు. కాగా.. తాజాగా.. మరో వీడియో షేర్ చేశారు.

అందులో అనుష్క, కోహ్లీని టీజ్ చేయగా... అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్టేడియంలో కేరింతలు కొడుతున్న అభిమాని.. విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టవా..? అని అడుగుతున్నట్లు అనుష్క శర్మ అనుకరించింది. దాంతో కోహ్లీ కూడా సీరియస్‌గా ఓ లుక్ వదిలాడు.

ఈ వీడియోపై చాహల్ స్పందించాడు. అయితే తనను ఏకంగా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా పంపించేవిధంగా సారథి విరాట్‌కోహ్లికి సిఫార్సు చేయాల్సిందిగా బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మను ఇన్‌స్టాలో అభ్యర్థించాడు. అంతేకాకుండా అనుష్క మాటను కోహ్లి తప్పకుండా వింటాడని, తనను టీమిండియా ఓపెనర్‌గా పంపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘కోహ్లి లక్షలాది ఫ్యాన్స్‌ ప్రేమతో పాటు మైదానాన్ని మిస్సవుతున్నాడని నాకనిపిస్తోంది. ప్రత్యేకించి కొంతమంది వినూత్నమైన ఫ్యాన్స్‌ను కూడా మిస్‌ అవుతున్నాడు(బాల్‌ గట్టిగా కొట్టమని కేకలు పెడుతూ చెప్పేవారు). అందుకే అతడికి ఆ అనుభవాన్ని కలిగిస్తున్నా’ అంటూ ‘ ఏయ్‌ కోలీ(కోహ్లి) చౌకా మార్‌.. చౌకా.. క్యా కర్రా’ అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది. కాగా, తన సతీమణి అల్లరికి కోహ్లి బిత్తరచూపులు చూడటం తప్పితే చేసేదేమీ లేకపోయింది. 


భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం విరుష్క జోడీ రూ. 3 కోట్లు విరాళంగా ప్రకటించింది. అంతేకాకుండా.. గత నెల నుంచే వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తోంది. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ని తొలుత ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. తాజాగా నిరవధికంగా వాయిదా వేసేసింది. దీంతో.. మరికొన్ని రోజుల పాటు క్రికెటర్లు ఆటకి దూరంగా ఉండనున్నారు.