Kagiso Rabada: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ లో కగిసో రబాడ (5/51) అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను కేవలం 212 పరుగులకే కట్టడి చేసింది దక్షిణాఫ్రికా.

Australia vs South Africa: లండన్‌లోని లార్డ్స్ మైదానంలో బుధవారం ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో, దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ విజృంభించాడు. అతని 5 వికెట్ల ప్రదర్శనతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 212 పరుగులకే ఆలౌట్ అయింది. రబాడాకు లార్డ్స్‌లో రెండోసారి ఐదు వికెట్లు దక్కడం విశేషం.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా.. మేఘావృత వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకొని తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఘోరంగా ప్రారంభించింది. కగిసో రబాడా తన తొలి స్పెల్‌లోనే ఉస్మాన్ ఖవాజా (0), కామెరూన్ గ్రీన్ (4)ను ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. అప్పటికి ఆసీస్ స్కోరు 16/2గా ఉంది.

వెబ్‌స్టర్, స్మిత్ పోరాటం

ఆస్ట్రేలియా తిరిగి కోలుకోవడంలో స్టీవ్ స్మిత్ (66 పరుగులు), బ్యూ వెబ్‌స్టర్ (72 పరుగులు) భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది. వీరిద్దరూ ఐదవ వికెట్‌కు 79 పరుగులు జతచేశారు. హాఫ్ సెంచరీ తర్వాత స్మిత్‌ను పార్ట్‌టైమ్ ఆఫ్‌స్పిన్నర్ ఐడెన్ మార్క్రామ్ ఔట్ చేశాడు.

ఆ తర్వాత బ్యూ వెబ్‌స్టర్ తన రెండో టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అతను 92 బంతుల్లో 11 బౌండరీలతో 72 పరుగులు చేశాడు. 8 పరుగుల వద్ద రబాడ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూకు దక్షిణాఫ్రికా రివ్యూ తీసుకోలేదు, అది వెబ్‌స్టర్‌కు కలిసొచ్చింది.

రబాడ రఫ్ఫాడించాడు

ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ కూడా పెద్దగా ఏమి చేయలేకపోయింది. కెప్టెన్ పాట్ కమిన్స్ (1), మిచెల్ స్టార్క్ (1), నాథన్ లియాన్ (0) త్వరగా పెవిలియన్ చేరారు. మొత్తం 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. రబాడ 5 వికెట్లు తీసుకున్నాడు. మార్కో జాన్సెన్ 3 వికెట్లు పడగొట్టాడు.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్ పరుగులేమీ చేయకుండానే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తొలి రోజు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 43-4 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా 1998 ICC నాకౌట్ టోర్నమెంట్ తర్వాత తన మొదటి ప్రధాన ICC టైటిల్‌ను అందుకోవాలని చూస్తోంది. ఇక ఇటీవలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ 2023లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా.. మరోసారి ట్రోఫీని దక్కించుకోవాలనే వ్యూహాలతో మ్యాచ్ ను మొదలుపెట్టింది.