ICC Hall of Fame: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇప్పటివరకు 11 మంది భారత క్రికెటర్లకు స్థానం లభించింది. వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

List of 11 Indian cricketers in ICC Hall of Fame: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2009 జనవరి 2న "హాల్ ఆఫ్ ఫేమ్"ను ప్రారంభించింది. ఈ గౌరవం క్రికెట్ చరిత్రలో అపూర్వమైన కీర్తి సాధించిన లెజెండరీ క్రికెటర్లకు లభిస్తుంది. ఇప్పటివరకు 11 మంది భారత క్రికెటర్లు ఈ గౌరవం దక్కించుకున్నారు. వారి వివరాలు గమనిస్తే..

1. బిషన్ సింగ్ బేడీ

భారత స్పిన్ క్వార్టెట్‌లో భాగమైన బిషన్ సింగ్ బేడీ 1960ల చివరి దశ నుంచి 1970ల వరకు టెస్టు క్రికెట్‌లో భారత తరఫున గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. 67 టెస్టులలో 266 వికెట్లు తీసిన ఆయన, ఫస్ట్‌క్లాస్ స్థాయిలో మొత్తం 1560 వికెట్లు పడగొట్టారు.

2. సునీల్ గవాస్కర్

భారత క్రికెట్‌లో తొలి "లిటిల్ మాస్టర్"గా పేరొందిన సునీల్ గవాస్కర్, టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయి చేరిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందారు. 125 టెస్టుల్లో 10,122 పరుగులు చేయగా, ఇందులో 34 సెంచరీలు ఉన్నాయి. 2009లో సునీల్ గవాస్కర్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించారు.

3. కపిల్ దేవ్

1983 ప్రపంచకప్‌ను భారత్ గెలవడానికి నాయకత్వం వహించిన కపిల్ దేవ్, ఆల్‌రౌండర్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారు. 131 టెస్టుల్లో 434 వికెట్లు తీసుకోవడంతో పాటు 5248 పరుగులు చేశారు. 225 వన్డేల్లో 253 వికెట్లు తీసుకున్నారు, అలాగే 3783 పరుగులు చేశారు.

4. అనిల్ కుంబ్లే

ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లే. 619 టెస్టు వికెట్లు, 337 వన్డే వికెట్లు తీసుకున్నారు. టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన అరుదైన ముగ్గురు ప్లేయర్లలో ఒకరిగా నిలిచారు.

5. రాహుల్ ద్రవిడ్

"ది వాల్" గా పేరొందిన రాహుల్ ద్రవిడ్.. టెస్టులు, వన్డేల్లో 10,000+ పరుగులు చేసిన కొద్దిమందిలో ప్లేయర్లలో ఒకరు. 164 టెస్టుల్లో 13,288 పరుగులు చేశారు. 344 వన్డేల్లో 10,889 పరుగులు చేశారు. తన కెరీర్ లో 48 అంతర్జాతీయ సెంచరీలు సాధించారు.

6. సచిన్ టెండూల్కర్

కేవలం భారత్ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలో అగ్రగామిగా నిలిచిన సచిన్ టెండూల్కర్.. 664 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 34,357 పరుగులు చేశారు. సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక ప్లేయర్. అలాగే, 164 హాఫ్ సెంచరీలు కొట్టారు. ఇంకా చాలా రికార్డులు సచిన్ పేరట ఉన్నాయి.

7. వినూ మాంకడ్

ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన మాంకడ్, 233 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 11,591 పరుగులు, 782 వికెట్లు తీశారు. 44 టెస్టుల్లో 162 వికెట్లు, 2109 పరుగులు చేశారు. యువ క్రికెటర్లకు ప్రోత్సాహంగా ఉన్న "వినూ మాంకడ్ ట్రోఫీ" ఆయన పేరు మీదనే ఏర్పాటు చేశారు.

8. డయానా ఎడుల్జీ

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు పొందిన తొలి భారత మహిళా క్రికెటర్ డయానా. 20 మహిళల టెస్టుల్లో 63, 34 వన్డేల్లో 46 వికెట్లు తీశారు.

9. వీరేంద్ర సెహ్వాగ్

భారత క్రికెట్ చరిత్రలో మొదటి ట్రిపుల్ సెంచరీ సాధించిన సెహ్వాగ్, టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన అరుదైన ప్లేయర్లలో ఒకరు. తన కెరీర్ లో 8586 టెస్టు పరుగులు, 8273 వన్డే పరుగులు సాధించారు.

10. నీతూ డేవిడ్

1995లో 8/53తో మహిళల టెస్టుల్లో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్లు సాధించిన నీతూ, 10 టెస్టుల్లో 41 వికెట్లు తీసుకున్నారు. అలాగే, 97 వన్డేల్లో 141 వికెట్లు తీసారు.

11. ఎంఎస్ ధోని

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన ధోని, మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్. 90 టెస్టుల్లో 4876, 350 వన్డేల్లో 10773, 98 టి20ల్లో 1617 పరుగులు చేశారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు.