‘ఇంతకుమించి ఏమీ పీకలేవు’.. రచ్చకెక్కుతున్న ఆంధ్రా టీమ్ క్రికెట్.. హనుమా విహారికి పృథ్వీరాజ్ కౌంటర్
ఆంధ్రా టీమ్ కెప్టెన్‌గా పని చేసిన హనుమా విహారి పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. తాను కెప్టెన్సీగా రాజీనామా చేయడానికి తన జట్టులోని ఓ ఆటగాడి తండ్రి (రాజకీయ నాయకుడు) కారణం అని ఆరోపించారు. దీంతో ఆ ఆటగాడు ఎవరా? అనే ఆసక్తి నెలకొంది. ఇంతలోనే ఆ ఆటగాడిని తానేనంటూ పృధ్వీరాజ్ సోషల్ మీడియాలో వెల్లడించుకుంటూ హనుమా విహారి చేసిన ఆరోపణలు అసత్యాలని ఖండించారు.
ఆంధ్రా క్రికెట్ టీమ్ రచ్చకెక్కుతున్నది. హనుమా విహారి కెప్టెన్సీ వదిలిపెట్టడానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోగానే.. మరో ట్విస్టు ఎదురైంది. హనుమా విహారి ప్రస్తావించిన ప్లేయర్ స్వయంగా.. సోషల్ మీడియాలో పోస్టు చేసి కౌంటర్ ఇచ్చాడు. మిస్టర్ సో కాల్డ్ చాంపియన్.. ఇంతకు మించి ఏమీ పీకలేవు అంటూ కామెంట్ చేశాడు. ఈ వివాదం గాలి వానగా మొదలై చిలికి చిలికి తుఫాన్‌గా మారే ప్రమాదం కనిపిస్తూనే ఉన్నది. ఇంతకు అసలు ఏం జరిగిందో చూద్దాం.
రంజి ట్రోఫీలో ఈ రోజు క్వార్టర్స్ ఫైనల్స్‌లో ఆంధ్రా టీమ్ మధ్యప్రదేశ్ పై స్వల్ప పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ట్రోఫీలో ఆంధ్రా టీమ్ బెంగాల్ టీమ్‌తో ఆట మొదలు పెట్టింది. అప్పుడు ఆంధ్రా టీమ్ కెప్టెన్ హనుమా విహారి. కానీ, ఆ తర్వాత రిక్కీ భూయి ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఈ రోజు మధ్యప్రదేశ్‌తో ఆంధ్రా టీమ్ ఓటమి పాలయ్యాక హనుమా విహారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సంచలన పోస్టు పెట్టాడు. అందుకు కౌంటర్‌గానే ఇప్పుడు ఆంధ్రా క్రికెట్ జట్టు సభ్యుడు పృథ్వీ రాజ్ కౌంటర్ పెట్టాడు.
ముందు హనుమా విహారి ఏం పోస్టు పెట్టాడో ఓ సారి చూద్దాం. ‘ఫస్ట్ గేమ్ బెంగాల్‌తో ఆడినప్పుడు నేను కెప్టెన్. ఆ సమయంలో నేను 17వ ప్లేయర్ పై అరిచాను. అతను రాజకీయ నాయకుడైనా తన తండ్రికి నా మీద ఫిర్యాదు చేశాడు. దీనికి ఆయన తండ్రి నాపై యాక్షన్ తీసుకోవాలని అసోసియేషన్‌కు చెప్పాడు. గతేడాది ఫైనలిస్టు జట్టు బెంగాల్ పై మేం 410 పరుగులు చేశాం. అయినా.. నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాలని ఆదేశించారు. నా వైపు ఎలాంటి తప్పు లేకున్నా నన్ను రాజీనామా చేయమని అన్నారు. వాస్తవానికి నేను ఆ ప్లేయర్‌ను వ్యక్తిగతంగా ఎలాంటి మాట అనలేదు. కానీ, మన అసోసియేషన్‌కు గత ఏడేళ్లలో ఆంధ్రాను ఐదు సార్లు నాక్ ఔట్‌కు తీసుకెళ్లినా.. 16 అంతర్జాతీయ టెస్టులు ఆడిన.. ఆటకే అంకితమైన ప్లేయర్(విహారీనే) కంటే.. ఆ ప్లేయర్ ముఖ్యమైనవాడిగా కనిపించాడు’
‘నాకు చాలా అవమానం అనిపించింది. అయినా.. ఇవాళ్టి వరకు ఆడుతున్నానంటే అదికేవలం ఈ ఆటపై, మా టీమ్ పై ఉన్న గౌరవమే. నేను భంగపడ్డా, అవమానానికి గురైనా ఇవాళ్టి వరకు ఈ విషయాలను బయటికి వెల్లడించలేదు. కానీ, నేను ఒక నిర్ణయం తీసుకున్నానుం. నా ఆత్మగౌరవం పోయిన ఆంధ్రా టీమ్ కోసం ఇకపై ఆడదలచుకోలేదు. కానీ, ఆ టీమ్ అంటే ప్రేమ. ప్రతి సీజన్‌కు మేం వృద్ధి చెందుతున్న తీరు కూడా ఇష్టం. కానీ, ఈ అసోసియేషన్ మమ్మల్ని ఎదగనివ్వడం లేదు’ అని హనుమా వివాహరి సంచలన పోస్టు పెట్టాడు.
Also Read: Hanuma Vihari: ఆ రాజకీయ నేత వల్లే కెప్టెన్సీకి రాజీనామా.. సంచలన విషయాలు బయటపెట్టిన విహారి
దీనికి కౌంటర్‌గా ఇన్‌స్టాలోనే పృథ్వీ రాజ్ కౌంటర్ పెట్టాడు. ‘మీరు ఆ కామెంట్ బాక్స్‌లో వెతుకుతున్న ఆ ప్లేయర్(హనుమా విహారి ప్రస్తావించిన ప్లేయర్)ను నేనే. మీరు విన్నదంతా అబద్దం. గేమ్ కంటే ఎవరూ పెద్దవారు కాదు. నా ఆత్మగౌరవం కంటే పెద్దదేమీ లేదు. వ్యక్తిగత దాడులు, నిందాపూర్వక భాష అది ఏ వేదికమీదనైనా అంగీకారయోగ్యం కాదు. ఆ రోజు ఏం జరిగిందో జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసు. నువ్వు ఇంతకు మించి ఏమీ పీకలేవు మిస్టర్ సో కాల్డ్ చాంపియన్’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ‘ఒక వేళ నీవు కావాలనుకుంటే ఈ సింపథీ గేమ్ ఆడుకో’ అంటూ ఆరోపించాడు.
ఈ పోస్టులపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నది. కొందరు అసలేం జరిగిందని ఆరా తీస్తుండగా.. మరికొందరు క్రికెట్ బాక్సాఫీసుగా మారుతున్నదని పేర్కొన్నారు. మరికొందరైతే.. బీసీసీఐ వెంటనే జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించాలని కోరారు. వీరి కెరీర్ స్టార్ట్ కావడానికి ముందే క్లోజ్ అయ్యేలా ఉన్నది కదా అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.