వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో సౌతాఫ్రికా విజయం దిశగా క్రమంగా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 213 పరుగుల వద్ద కొనసాగుతోంది. సౌతాఫ్రికా విజయానికి ఇంకా కేవలం 69 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది.
ఫైనల్ మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఫెయిలైన మార్క్‌రమ్ రెండో ఇన్నింగ్స్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో రాణించాడు. ప్రారంభం నుంచే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ, 156 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు.
మార్క్‌రమ్‌కు తోడుగా నిలిచిన కెప్టెన్ టెంబ బవుమా కూడా కీలక సమయంలో బ్యాటింగ్‌లో రాణించాడు. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, బవుమా ధైర్యంగా ఆడుతూ మ్యాచ్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలసి 119 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేశారు. ఫలితంగా మూడో రోజు చివరి సెషన్‌లో ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయింది.
అయితే మూడో రోజు ప్రారంభంలో ఆస్ట్రేలియాకు 218 పరుగుల ఆధిక్యం ఉండగా, స్టార్క్ అర్ధశతకంతో దానిని 281 పరుగుల వరకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో మ్యాచ్ మీద పూర్తిగా ఆస్ట్రేలియా వైపే ఉన్నట్లు అనిపించింది. కానీ దక్షిణాఫ్రికా సీనియర్ల అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ మలుపు తిరిగింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 69 పరుగులు మాత్రమే అవసరం. నాలుగో రోజు ప్రారంభంలోనే ఈ విజయాన్ని ఖాయం చేసేందుకు మార్క్రమ్, బవుమా సిద్ధంగా ఉన్నారు. 1998 తర్వాత ఇదే దక్షిణాఫ్రికా తొలి ఐసీసీ టైటిల్ గెలవడానికి అడుగు దూరంలో ఉంది. మరి సౌతాఫ్రికా విజయం ఖాయమవుతుందా.? లేదా ఆస్ట్రేలియా ఏమైనా మ్యాజిక్ చేస్తుందా చూడాలి.
