కరాచీ: హిందువును అయినందుకు కొంత మంది క్రికెటర్లు తనను టార్గెట్ చేసినప్పటికీ దాన్ని తాను వివాదంగా మార్చలేదని జీవిత కాలం నిషేధాన్ని ఎదుర్కుంటున్న పాకిస్తాన్ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నారు. భోజనం వేళ డానిష్ కనేరియా పట్ల జట్టు సభ్యులు వివక్ష ప్రదర్శించారని షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను వివక్షకు గురైనప్పటికీ మతం మారాలనే వాంఛకు గానీ ఒత్తిడికి గానీ తాను గురి కాలేదని చెప్పాడు.

సమా చానెల్ తో శుక్రవారం కనేరియా మాట్లాడుతూ ఆ విషయాలు చెప్పారు. తాను క్రికెట్ పై దృష్టి కేంద్రీకరించి, పాకిస్తాన్ కు విజయాలు అందించాలని అనుకోవడం వల్ల తన పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను తాను ఏనాడు కూడా వివాదంగా మార్చలేదని, వారిని తాను పట్టించుకోలేదని ఆయన చెప్పారు.  

Also Read: భోజనం వేళ వివక్ష, అక్తర్ వ్యాఖ్యలు: ఎవరీ డానిష్ కనేరియా?

తాను హిందువును, పాకిస్తానీని అయినందుకు గర్విస్తున్నట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ ను ప్రతికూలంగా చూపడానికి తాను ప్రయత్నించలేదని, ఎందుకంటే మతాన్ని పట్టించుకోకుండా తనకు చాలా మంది సాయం చేశారని, తనకు మద్దతు ఇచ్చారని ఆయన చెప్పారు. 

క్రైస్తవం నుంచి ఇస్లాం మతంలోకి మారిన బ్యాట్స్ మన్ యూసుఫ్ యౌహానా గురించి ప్రస్తావించగా వ్యక్తుల ఇష్టానిష్టాలపై తాను మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. ముసమ్మద్ యూసుఫ్ ది వ్యక్తిగత నిర్ణయమని, తాను మతం మార్చుకోవాల్సిన అవసరం ఉందని తాను ఎన్నడూ భావించలేదని, ఎందుకంటే తాను హిందూ మతాన్ని విశ్వసిస్తున్నానని, మతం మారాలని తనపై ఎవరు కూడా ఒత్తిడి చేయలేదని చెప్పారు. 

Also Read: షోయబ్ చెప్పింది ముమ్మాటికీ నిజం... హిందూ వివక్ష పై కనేరియా స్పందన

ఎవరి నుంచి షోయబ్ భాయ్ వినిఉంటాడు లేదా ఎవరో ఆయనకు చెప్పి చెప్పి ఉంటారని, పాకిస్తాన్ కు అత్యున్నత స్థాయిలో తాను ప్రాతినిధ్యం వహించానని, క్రికెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత పాకిస్తాన్ కు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నానని, అలా ప్రాతినిధ్యం వహించానని ఆయన అన్నారు. 

ఇంజమాన్ తనను మ్యాచ్ విన్నర్ గా అభివర్ణించారని, తన కెరీర్ లో చాలా సంస్థలు తనకు మద్దతు ఇచ్చాయని, మైదానంలో తాను అత్యుత్తమ సేవలు అందించానని, దాన్ని ఇంజమామ్ మాటలు నిరూపిస్తున్నాయని, నిజానికి తాను పాకిస్తానీని అయినందుకు గర్విస్తున్నానని కనేరియా అన్నారు. 

Also Read: హిందువు కాబట్టే: కనేరియాపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

తనను టార్గెట్ చేసిన ఆటగాళ్ల పేర్లు చెప్పాలని ఒత్్తిడి చేయగా, వారి పేర్లను తర్వాత తన యూట్యూబ్ లో వెల్లడిస్తానని అన్నారు. అందుకు ఇది సరైన సమయం కాదని, దాని గురించి తన చానెల్ లో మాట్లాడుతానని అన్నారు. 

తనతో భోజనం చేయడానికి నిరాకరించిన సందర్భాలను చెప్పాల్సిందిగా అడిగినప్పుడు పాకిస్తాన్ తన జన్మభూమి అని, కొద్ది మంది ఆటగాళ్ల ప్రవర్తనను ఆసరా చేసుకోని దాన్ని రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తప్పుడు విధానంలో చూడకూడదని ఆయన అన్నారు.