రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆటో డ్రైవర్ రమేష్, వెంకటలక్ష్మి దంపతులు శుక్రవారం నాడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఘటన స్థలంలో పోలీసులు క్లూస్  సేకరిస్తున్నారు.

Also read:కరోనా ఎఫెక్ట్: 3 నెలల బడ్జెట్‌కు ఆర్డినెన్స్, 27న ఏపీ కేబినెట్

రాజమండ్రి పట్టణంలోని ఆటో డ్రైవర్ గా పనిచేసే రమేష్ అతని భార్య వెంకటలక్ష్మి సగం కాలిన మృతదేహాలను  స్థానికులు చూసి శుక్రవారం నాడు ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

సంఘటన స్థలంలో సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కరోనా వ్యాధి సోకిన కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా సూసైడ్ లెటర్ లో రాశారు. ఈ లేఖలో కేవలం రెండు లైన్లు మాత్రమే రాసి ఉంది. కరోనా వ్యాధి సోకిందనే కారణంగానే ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా ఉంది.

కొంత కాలం నుండి ఆర్ధిక ఇబ్బందులతో ఈ కుటుంబం బాధపడుతోందని రమేష్ బంధువులు పోలీసులకు చెప్పారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేదా కరోనా వ్యాధి సోకిందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మృతదేహాలు ఉన్న చోట దొరికిన బ్యాగులో ఆసుపత్రికి వెళ్లి వచ్చినట్టుగా ప్రిస్కిప్షన్స్ కూడ లభ్యమయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఎవరైనా హత్యచేసి మృతదేహాలు ఇక్కడకు తీసుకొచ్చి వేశారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.