అమరావతి:ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 27వ తేదీన జరగనుంది. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకొనే చర్యలపై కేబినెట్ చర్చించనుంది. మరో వైపు మూడు మాసాల పాటు బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది.

ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు అమరావతిలో జరగనుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ తరుణంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై కేబినెట్ లో చర్చించనున్నారు.

మరో వైపు ఈ మాసంలో బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. వచ్చే నెల 14వ తేదీ వరకు దేశం మొత్తం లాక్ డౌన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Also read:కరోనా ఎఫెక్ట్: పొందుగుల బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత, ఏపీలోకి నో ఎంట్రీ

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపకపోతే నిధులు వినియోగించుకోలేని పరిస్థితి ఉండదు. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకోవాలంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కష్టమే.

 దీంతో ఆర్డినెన్స్ తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపితే మూడు మాసాల పాటు నిధుల ఖర్చుకు ఏపీ సర్కార్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

మూడు మాసాల పాటు బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తీసుకురానుంది. జూన్ 30వ తేదీ వరకు నిధుల వినియోగం కోసం ఆర్డినెన్స్ తీసుకురానున్నారు.
లాక్‌డౌన్ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. 

ఏపీ రాష్ట్రంలో ఇప్పటికే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణంలలో మూడుపాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లాపై ప్రత్యేకంగా కేంద్రీకరించింది.