అంతపెద్ద వ్యవస్థ ఉంటే.. అలా చేస్తారా: జగన్‌కు చంద్రబాబు లేఖ

కరోనా వ్యాధి తీవ్రత నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు

tdp chief Chandrababu Naidu writes to Andhra CM Jagan Reddy over coronavirus

కరోనా వ్యాధి తీవ్రత నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను రేషన్ షాపుల ముందు క్యూలో నిలబెట్టడం తగదని, నాలుగున్న లక్షల మంది గ్రామ వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుంటూ నిత్యావసరాలను ఇంటింటికీ పంపిణీ చేయాలని చంద్రబాబు కోరారు.

ప్రతి కుటుంబానికి తక్షణమే రూ.5 వేలు చెల్లించాలని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదని, ఉద్యానవన పంటలతో పాటు ఆక్వా, పౌల్ట్రీ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రతిపక్షనేత కోరారు.

Also Read:అధిక ధరలు, సామాన్యుడిలా మారువేషంలో కలెక్టర్: అవాక్కైన వర్తకులు

రైతులకు కనీస మద్ధతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవటంతో పాటు వివిధ రంగాల రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా మద్యం విక్రయాలు ఆగిపోయినప్పటికీ, అనధికార విక్రయాలు మాత్రం పెరుగుతున్నాయని వీటిని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

క్షేత్ర స్థాయిలో పనిచేసేవారికి తగు రక్షణ పరికరాలు అందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలను ప్రభుత్వం చాలా తక్కువగా చేసిందని కరోనా కట్టడి కావాలంటే నిర్థారణ పరీక్షా కేంద్రాలను ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలని టీడీపీ చీఫ్ డిమాండ్ చేశారు.

ఈ నెల 17వ తేదీన నిజాముద్దీన్‌లో మత ప్రార్థనలకు హాజరై దాదాపు 700 మంది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అంశం కలవరపెడుతోందన్నారు. వీరందరికీ తక్షణమే కోవిడ్ 19 పరీక్షలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Also Read:కేసీఆర్ బాటలో జగన్: ప్రభుత్వోద్యోగులకు రెండు విడతలుగా వేతనం

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పట్ల ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని, లాక్‌డౌన్ కారణంగా మానసిక ఆందోళనలకు గురికాకుండా వారికి ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రతిపక్షనేత సూచించారు.

ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను తీసుకోవాలని ఆయన సూచించారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి సాయం అందించేందుకు ప్రతి రాజకీయ పార్టీ సిద్ధంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios