కరోనా ఎఫెక్ట్: ఢిల్లీ నుండి వచ్చిన వారి కోసం అధికారుల ఆరా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల కోసం వెళ్లినవారి కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు
అమరావతి:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల కోసం వెళ్లినవారి కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు.ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా తేలడంతో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి పలువురు ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రార్థనల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఢిల్లీ నుండి వచ్చినవారికి కరోనా పాజిటివ్ లక్షణాలు తేలడంతో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు.
ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నుండి 11 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. మరో వైపు ప్రకాశం జిల్లా నుండి వెళ్లి వచ్చినవారికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
Also read:కరోనా దెబ్బ:విదేశాల నుండి వచ్చిన భర్త, దాచిన భార్య ఉద్యోగానికి ఎసరు
కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చిన కుటుంబసభ్యులతో పాటు ఈ మధ్య కాలంలో వారు ఎవరెవరిని కలిశారనే సమాచారాన్ని సేకరించి వారందరిని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. సుమారు 150 మందిని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఐసోలేషన్ వార్డులకు తరలించినట్టుగా సమాచారం. అనంతపురం జిల్లా ఉరవకొండతో పాటు వజ్రపుకొత్తూరుకు చెందిన ఐదుగురిని కూడ ఐసోలేషన్ వార్డులకు తరలించారు.
ఇక ప్రకాశం జిల్లా నుండి 53 మంది, నెల్లూరు జిల్లా నుండి 60 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారని అధికారులు సమాచారాన్ని సేకరించారు. రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్లతో పాటు సీసీటీవీ పుటేజీ ఆధారంగా అధికారులు ఈ సమాచారాన్ని సేకరించారు. వీరందరిని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. రాజమండ్రిలో సుమారు 21 మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో కూడ కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నిజామాబాద్ జిల్లా నుండి సుమారు 40 మంది ఢిల్లీ వెళ్లి వచ్చారని అధికారులు గుర్తించారు. వీరందరిని అధికారులు పరీక్షించనున్నారు.