కరోనా దెబ్బ:విదేశాల నుండి వచ్చిన భర్త, దాచిన భార్య ఉద్యోగానికి ఎసరు
విదేశాల నుండి వచ్చిన తన భర్త సమాచారాన్ని గోప్యంగా ఉంచిన నర్సుపై కృష్ణా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొన్నారు. ఆమెను విధుల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్.
మచిలీపట్నం:విదేశాల నుండి వచ్చిన తన భర్త సమాచారాన్ని గోప్యంగా ఉంచిన నర్సుపై కృష్ణా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొన్నారు. ఆమెను విధుల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్.
ఏపీ రాష్ట్రంలో కూడ రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. విదేశాల నుండి వచ్చిన వారి సమాచారాన్ని ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీ రాష్ట్రంలోకి సుమారు 28 వేలకు పైగా విదేశాల నుండి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. వీరందరిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నర్సుగా ఓ మహిళ పనిచేస్తోంది.ఆమె భర్త నెలలో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విదేశాల నుండి వచ్చిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.
నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఆమె తన భర్త విదేశాల నుండి వచ్చిన విషయాన్ని అధికారులకు చెప్పలేదు. విదేశాల నుండి వచ్చిన ఆ వ్యక్తి మచిలీపట్నంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడ పర్యటించినట్టుగా అధికారులు గుర్తించారు.
also read:ఉదయం 11గంటలు దాటితే సరుకుల కొనుగోలుకు నో: తేల్చేసిన ఏపీ సర్కార్
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నర్సు తన భర్త విదేశాల నుండి వచ్చిన విషయాన్ని దాచిపెట్టిన విషయం కలెక్టర్ దృష్టికి వచ్చింది. కాంట్రాక్టు పద్దతిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఆమెను తొలగిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా వైరస్ ఏ రకంగా వ్యాప్తి చెందుతోందో తెలిసి కూడ నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఆమె బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని జిల్లా యంత్రాంగం అభిప్రాయంతో ఉంది. దీంతో ఆమెను విధుల నుండి తప్పించాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు.