కరోనా వైరస్‌పై దేశమంతా పోరాడుతుంటే టీడీపీ నేతలు మాత్రం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన పేద ప్రజలను ఆదుకునేందుకు రూ.1,000 సాయం చేస్తే, దానిపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బొత్స విమర్శించారు. లాక్‌డౌన్ సందర్భంగా పేదలను ఆదుకునేందుకు ఇప్పటికే రేషన్, కందిపప్పు అందించామని మంత్రి తెలిపారు.

Also Read:కరోనాపై వాస్తవాలను ప్రజలకు చెప్పాలి: ఏపీ ప్రభుత్వానికి బాబు డిమాండ్

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పేద ప్రజలకు రూ.1000 ఆర్ధిక సాయం అందించామని, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టామని సత్యనారాయణ వెల్లడించారు.

అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటి క్లిష్ట పరిస్ధితుల్లో కూడా ప్రతిపక్షాలు నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని బొత్స మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించానికి ముందే జగన్ రూ.1000 సాయం చేస్తానని చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి జగన్‌కు, తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని.. బాధ్యత కలిగిన రాజకీయ నేతలుగా తాము ప్రజలకు అండగా ఉంటామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Also Read:కరోనా రోగుల ఇళ్లకు అరకిలోమీటరు దూరం వరకు రాకపోకలు బంద్: ఏపీ సర్కార్ నిర్ణయం

విశాఖపట్నంలో పలుచోట్ల నైట్ షెల్టర్లను ఏర్పాటు చేశామని, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులకు కూడా అండగా ఉంటున్నామని మంత్రి చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులని, ఆక్వా ఉత్పత్తులని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతుల దగ్గర కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.

కరోనాపై పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఛీఫ్ సెక్రటరీ నుంచి పారిశుద్య సిబ్బంధి వరకు భాగస్వాములయ్యారని బొత్స తెలిపారు. ప్రభుత్వం వెయ్యి రూపాయిలిస్తున్న సమయంలో  ఎమ్మెల్యేలు పాల్గొంటే తప్పేంటని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు.