ప్రభుత్వం ఎంతగా కట్టుదిట్టమైన చర్యలు  తీసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గురువారం రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన 28 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఏపీలో కోవిడ్ 19 కేసులు 11కు చేరాయి.

ఆ యువకుడు ఈ నెల 18న స్వీడన్ నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నాడు. ఈ క్రమంలో కరోనా లక్షణాలతో విజయవాడ జీజీహెచ్‌లో చేరాడు. ఆ యువకుని శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా.. పాజిటివ్‌గా రిజల్ట్ వచ్చింది. ఇతనితో కలిపి బెజవాడలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది.

Also Read:ఏపీ, తెలంగాణ సరిహద్దులో ముదిరిన వివాదం: పోలీసులపై రాళ్ల దాడి

నగరంలో వరుసగా కరోనా కేసులు బయటపడుతుండటంతో బెజవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం వాషింగ్టన్ నుంచి విజయవాడ వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు.

మరో వైపు, గుంటూరు జిల్లాలో ఓ కరోనా కేసు బయటపడింది. ప్రత్యేక ప్రార్థనల్లో పొల్గొని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ రెండు కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. 

Also Read:కరోనా ఎఫెక్ట్, ఏపీలోకి నో ఎంట్రీ: తేల్చేసిన జగన్

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. లండన్ లో ఎంసిఏ చదువుతున్న ఆ యువకుడు ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీన శ్రీకాళహస్తి చేరుకున్నాడు. 

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.