ఏపీ, తెలంగాణ సరిహద్దులో ముదిరిన వివాదం: పోలీసులపై రాళ్ల దాడి

నిన్న రాత్రి నుంచి గుంటూరు జిల్లా దాచేపల్లి చెక్ పోస్టు వద్ద పడిగాపులు పడిన ఏపీ వాసులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దాంతో ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో వివాదం ముదిరింది.

coronavirus: Clash between people and police at AP and Telangana boarder

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎపీ, తెలంగాణ సరిహద్దులో వివాదం ముదిరింది. గుంటూరు సరిహద్దులోని దాచేపల్లి చెక్ పస్టు వద్ద బుధవారం రాత్రి నుంచి కొంత మంది వేచి ఉన్నారు. తెలంగాణ నుంచి ఆంద్రప్రదేశ్ లోని తమ స్వగ్రామాలకు వెళ్లడానికి వారు నిరీక్షిస్తూ ఉన్నారు. 

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావడానికి సిద్ధమైనవారికి సంబంధించి గురువారం సాయంత్రం వైఎస్ జగన్ ప్రకటన చేశారు. ఆ తర్వాత పోలీసులకు, వారికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులపైకి ఏపీ వాసులు రాళ్లు రువ్వారు.

లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకుని కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో మాట్లాడానని, ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. సరిహద్దులో చిక్కుకుపోయినవారిని చూసి, నిన్నటి సంఘటనలు చూసి తన మనసు చలించిపోయిందని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. తాజాగా గుంటూరు, విజయవాడల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ నుంచి విజయవాడ వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు.

మరో వైపు, గుంటూరు జిల్లాలో ఓ కరోనా కేసు బయటపడింది. ప్రత్యేక ప్రార్థనల్లో పొల్గొని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ రెండు కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. 

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. లండన్ లో ఎంసిఏ చదువుతున్న ఆ యువకుడు ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీన శ్రీకాళహస్తి చేరుకున్నాడు. 

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios