Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: ఏపీలో ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు జగన్ ఆదేశం

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌వార్డులను ఏర్పాటు చేయాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
 

CM Ys jagan orders every hospital have isolation ward in Andhra pradesh
Author
Amaravathi, First Published Apr 5, 2020, 6:13 PM IST

అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌వార్డులను ఏర్పాటు చేయాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

 కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్  అధికారులతో ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య,ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు.

also read:తిరుపతి రుయా, స్విమ్స్ మధ్య సమన్వయలోపం: అంబులెన్స్‌లోనే ఆరుగురు కరోనా రోగులు

రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల గురించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఢిల్లీలో మర్కజ్ ప్రార్ధనలకు హాజరైన వారితో పాటు వారితో సన్నిహితంగా ఉన్నవారికి వెంటనే పరీక్షలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత సెకండరీ కాంటాక్ట్స్ పై దృష్టి పెటాల్ని ఆయన సూచించారు.

క్వారంటైన్, ఐసోలేషన్‌ తరలింపుపై ఇదివరకే ఉన్న మార్గదర్శకాలను సంపూర్ణంగా పాటించాలన్నారు. క్వారంటైన్ లో ఉన్న వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆయన సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి సర్వే చేసి నమోదు చేసిన డేటా ఆధారంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి వైద్యులు నిర్ధారించిన వారికి తదుపరి పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా నివారణకింద నిర్దేశించుకున్న విధానాల ప్రకారం ముందుకెళ్లాలని సీఎం కోరారు.

 కరోనా వ్యాప్తి స్థాయిని అంచనా వేయడానికి ప్రయోగాత్మకంగా విశాఖపట్నంలో క్లస్టర్ల వారీగా నిర్వహించిన ల్యాబ్‌ పరీక్షల ఫలితాలను సీఎంకు అధికారులు వివరించారు. విశాఖ నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులున్న రెడ్‌జోన్లను 8 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌ నుంచి 20 నమూనాలు చొప్పున తీసుకుని పరీక్షించినట్టుగా అధికారులు తెలిపారు.

విదేశాలనుంచి వచ్చిన వారు, అలాగే రిస్కు ఎక్కువగా ఉన్న వయసులోని వ్యక్తులు, ఇలా అన్ని కేటగిరీల వారీగా ఈ నమూనాలు తీసుకున్నామన్న అధికారులు
అన్ని ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయన్నారు అధికారులు.

ప్రతి కుటుంబాన్ని సర్వే చేయగా వస్తున్న ఫలితాలను, వైద్య సిబ్బంది సేకరించిన ఫలితాలను, అలాగే పోలీసుల సహాయంతో సేకరిస్తున్న వివరాలను... వీటన్నింటినీ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. వైరస్‌ సోకిన వారికి వైద్యం అందించే విషయంలో తీసుకోవాల్సిన చర్యల విషయంలో పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు.

కరోనా లక్షణాలతో ఏ రోగి వచ్చినా ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్‌ వార్డులోనే ఉంచి చికిత్స చేయించాలని సీఎం ఆదేశించారు.వైద్యులు, వైద్య సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుని ఆమేరకు ఐసోలేషన్‌వార్డుల్లో చికిత్స అందించాల్సిందిగా ఆదేశించారు సీఎం.

రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మందికి వేగంగా పరీక్షలు చేయించేలా చూడాలని సీఎం కోరారు. ఇప్పటికి 7 చోట్ల ల్యాబ్‌లు ఉన్నాయని, విశాఖ, విజయవాడ సహా మూడుచోట్ల ఉన్న ల్యాబ్‌ల సామర్థ్యం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. 

ప్రతి జిల్లాలో కూడా ఒక ల్యాబ్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలన్నారు . రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రెడ్‌జోన్లు, హాట్‌ స్పాట్ల ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అనంతరం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సీఎం ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios