నిబంధనల ఉల్లంఘణ, వైసీపీ నేతలపై చర్యలకు డిమాండ్: ఎస్ఈసీ కి బాబు లేఖ
అమరావతి: పేదలకు సహాయం చేసే పేరుతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో వెయ్యి రూపాయాల నగదు పంపిణీ చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ను కోరారు.
అమరావతి: పేదలకు సహాయం చేసే పేరుతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో వెయ్యి రూపాయాల నగదు పంపిణీ చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ను కోరారు.
బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు చంద్రబాబునాయుడు లేఖ రాశారు.ఈ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఆర్ధిక సహాయం, రేషన్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన నగదును లబ్దిదారులకు అందిస్తున్నట్టుగా చంద్రబాబునాయుడు ఆరోపించారు.అంతేకాదు ఎన్నికల ప్రచారంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొంటున్నారన్నారు. ఈ విషయమై ఫోటోలు, వీడియోలు కూడ ఉన్నాయన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కుతూ , ప్రజాస్వామ్య స్పూర్తిని మంటగలుపుతున్నారని ఆయన వైసీపీ నేతలపై మండిపడ్డారు.
వలస కూలీలకు, రాష్ట్రంలోని పేదలకు రేషన్ తో పాటు ఈ నగదును వలంటీర్ల ద్వారా కాకుండా స్థానిక వైసీపీ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థులతో పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్ధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
కరోనాపై పోరాటంలో ప్రపంచం తమ శక్తిని ఉపయోగించి పోరాటం చేస్తోంటే రాష్ట్రంలో వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపైనే కేంద్రీకరించారన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను వైసీపీ నేతలు ఉల్లంఘించారని చంద్రబాబు చెప్పారు.
ప్రతి ఇంటికి రేషన్, నగదు పంపిణీ ముసుగులో వైసీపీ కండువాలు ధరించి,జెండాలతో ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.వైసీపీ నేతలు జనాన్ని పోగేసుకొని గుంపులు గుంపులుగా తిరగడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. అయితే మళ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించేవరకు కూడ ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు నిబంధనలను ఉల్లంఘించిన విషయమై తమ వద్ద ఫోటోలు, వీడియోలు ఉన్నట్టుగా ఆయన చెప్పారు. వీటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపుతామని ఆ లేఖలో చెప్పారు.
also read:కరోనా: ఏపీలో 15 గంటల్లో 15 కొత్త కేసులు, మొత్తం 329కి చేరిక
స్థానిక సంస్థల ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ చేస్తే అనర్హుడిగా ప్రకటించడంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని జారీ చేసిన ఆర్డినెన్స్ 2 ను కూడ ఈ సందర్భంగా కమిషనర్ దృష్టికి తెచ్చారు చంద్రబాబు.నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ నేతలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.