అమరావతి: ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్క రోజులోనే 40కు చేరుకొన్నాయి. సోమవారం నాటికి ఏపీ రాష్ట్రంలో 23 కేసులు మాత్రమే ఉన్నాయి. మంగళవారం ఉదయానికి 17 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టుగా ప్రభుత్వవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

also read:లాక్ డౌన్: ఏపి మత్స్యకారులకు తమిళనాడు సీఎం సాయం... పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు

ప్రకాశం జిల్లాలో సోమవారం నాడు ఉదయానికి మూడు పాజిటివ్ కేసులు ఉంటే మంగళవారం నాడు ఉదయానికి ఈ కేసుల సంఖ్య ఎనిమదికి చేరుకొంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో మత ప్రార్థనల కోసం వెళ్లి తిరిగి వచ్చిన వారి కారణంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా  ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కోసం ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారిని కలిసిన 69 మందికి కూడ వైద్య పరీక్షలను నిర్వహించారు వైద్యులు.

ఏపీ రాష్ట్రం నుండి ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన మత ప్రార్థనల కోసం 711 మంది వెళ్లినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఈ ప్రార్థనల కోసం వెళ్లిన వారి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. కర్నూల్, ప్రకాశం,ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుండి ఎక్కువగా ఈ సమావేశాలకు వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు.

నిజాముద్దీన్ మత ప్రార్థనల నుండి వచ్చి వెళ్లిన వారి కారణంగా  అనంతపురంలో 2, ప్రకాశంలో 8, గుంటూరు 6,కృష్ణా 1, తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వారి కారణంగా ఎంత మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందనే విషయమై కూడ ప్రభుత్వం ఆరా తీస్తోంది. కొందరు వారం రోజుల క్రితం, మరికొందరు 10 రోజుల క్రితం ఢిల్లీ నుండి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు.

ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత వీరంతా ఎవరెవరిని కలిశారనే విషయమై ప్రభుత్వం ఆరా తీస్తోంది.ఢిల్లీ నుండి వచ్చిన వారి బంధువులు, కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించనున్నారు. ఇప్పటికే గుర్తించిన 130 మందిని ఐసోలేషన్ వార్డులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

రాజమండ్రి శాంతినగర్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ, గుంటూరు, నెల్లూరులలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.రాజమండ్రి కాకినాడల్లోని మసీదుల్లో కూడ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఏపీ రాష్ట్రం నుండి నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ప్రకాశం జిల్లాలో ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కొడుకుకు కూడ కరోనా  పాజిటివ్ లక్షణాలు వచ్చినట్టుగా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. 

ఒంగోలు జిల్లాలోని చీరాలలో 3, కందుకూరు 3, కనిగిరి1, ఒంగోలు 1 కొత్త కేసులు నమోదైనట్టుగా రిమ్స్ సూపరింటెండ్ ప్రకటించారు. ఒంగోలు నుండి పంపిన 70 శాంపిల్స్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.

జిల్లాల వారీగా మొత్తం కేసులు

ప్రకాశం 11
గుంటూరు 9
విశాఖ 6
కృష్ణా 5
తుగొ 4
అనంతపూర్ 2
నెల్లూరు, చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి