లాక్ డౌన్: ఏపి మత్స్యకారులకు తమిళనాడు సీఎం సాయం... పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు
దేశంమొత్తంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఏపికి చెందిన కొందరు మత్స్యకారులు చెన్నైలో చిక్కుకున్నారు. వారికి సాయం చేయనున్నట్లు హామీ ఇచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన మత్స్యకారులు లాక్ డౌన్ వల్ల చెన్నైలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారిని రక్షించాలని చేసిన అభ్యర్థనపై సత్వరం స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కె.పళనిస్వామికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు.
చెన్నై హార్బర్ ప్రాంతంలో సోంపేట మండలం నుంచి వెళ్ళిన మత్యకారులు లాక్ డౌన్ మూలంగా ఇక్కట్ల పాలయ్యారు. వీరి సమస్యలు పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చిన వెంటనే వారికి వసతి, ఆహారం అందించి రక్షించాలని ఆదివారం రాత్రి ట్విటర్ ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కోరారు. అలాగే వీరి సమస్యపై స్పందించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి... శ్రీకాకుళం కలెక్టర్ కి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
పవన్ కల్యాణ్ గారు అభ్యర్థనకు స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఏపీ మత్స్యకారులను సంరక్షించాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే తమిళనాడు మత్స్యశాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. సోమవారం ఉదయమే మత్స్యకారులు చిక్కుకున్న హార్బర్ ప్రాంతానికి అధికారులు వెళ్ళి ధైర్యం చెప్పి వారికి అవసరమైన ఆహారం, మంచి నీళ్ళు, ఇతర సరుకులు, కిరాణా వస్తువులు అందచేశారు.
ఏపీ మత్స్యకారులను తమ అధికారులు కలిసి అవసరమైన సహాయం అందచేశారని, జాగ్రత్తగా చూస్తామని పవన్ కల్యాణ్ కి పళనిస్వామి ట్విటర్ ద్వారా తెలిపారు. శ్రీకాకుళం జిల్లాతోపాటు కాకినాడకు చెందినవారితో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారికీ తగిన సహాయం చేశామని... వారి కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
చెన్నై హార్బర్ దగ్గర చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించడంలో సత్వరమే స్పందించిన పళనిస్వామికి పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆదేశాల మేరకు ఆ మత్స్యకారులకు అవసరమైనవి అందడం ఆనందాన్ని కలిగించింది అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలపై తగిన చర్యలు తీసుకున్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులకు అభినందనలు చెప్పారు.
ఇబ్బందులు పడుతున్న మత్స్యకారుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొంటూ వారిని రక్షించడంలో జనసేన నాయకులు ప్రశంసనీయంగా వ్యవహరించారన్నారు. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజవర్గానికి చెందిన జనసేన నాయకుడు దాసరి రాజుని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.