కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని ప్రధాని, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అయినప్పటికీ కొందరు బాధ్యత లేకుండా రోడ్ల మీదకి అనవసరంగా వస్తున్నారు. తొలి రెండు రోజులు సహనంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాతి నుంచి పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్నారు. ఖాకీల ఓవరాక్షన్‌పై దేశవ్యాప్తంగా ప్రజలు విమర్శలు చేస్తున్నారు.

Also Read:''ఏపి లాక్ డౌన్: జగన్ సర్కార్ చర్యలు భేష్... తమిళ సీఎం అభినందనలు''

ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు లాక్‌డౌన్ అమలుతో పాటు కరోనా లక్షణాలున్న వారిని పర్యవేక్షించేందుకు సాంకేతిక సాయం తీసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హౌస్ క్వారంటైన్ యాప్‌ను రూపొందించారు బెజవాడ పోలీసులు.

హౌస్ క్వారంటైన్ యాప్ ద్వారా కరోనా లక్షణాలతో ఉన్న వారిని ఆన్‌లైన్ రిజిస్టర్ ద్వారా అనుసంధానిస్తారని అనుసంధానిస్తారని డీఐజీ రాజశేఖర్ బాబు తెలిపారు.

దీనికి జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని.. ఒకవేళ ఎవరైనా క్వారంటైన్ నుంచి బయటకి వెళ్లాలని చూస్తే యాప్ ద్వారా తక్షణమే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సంకేతాలు వెళ్తాయని డీఐజీ తెలిపారు.

Also Read:అశోక్ బాబు దీక్ష కుట్రే...జగన్ వెనకే మేమంతా: ఉద్యోగ సంఘాల జెఎసి

విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 20,625 మందిని ఈ యాప్‌కు అనుసంధానించామని, వీరిలో 11,234 మందికి 28 రోజుల హౌస్ క్వారంటైన్ పూర్తయిందని రాజశేఖర్ చెప్పారు. క్వారంటైన్ నుంచి తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు 17 రోజుల్లో 2,896 మంది క్వారంటైన్ నిబంధన ఉల్లంఘించారని, మరోసారి తప్పుచేస్తే వారిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని డీఐజీ హెచ్చరించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చి క్వారంటైన్‌లో ఉన్న మిగతావారిని కూడా ఈ యాప్ కిందకి తీసుకొస్తామన్నారు.

హౌస్ క్వారంటైన్ యాప్ ద్వారా కరోనా అనుమానితులపై 24 గంటలు పర్యవేక్షణ ఉంటుందని డీఐజీ చెప్పారు. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరితోనైనా కాంటాక్ట్ అయితే వారిని కూడా ఐసోలేషన్‌లో ఉంచుతామని ఆయన హెచ్చరించారు.