అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఒక్క రోజే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 

మంగళవారం నాడు క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఏపీ సీఎస్ నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు.

ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుండి రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందిందని ప్రభుత్వం గుర్తించింది. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారి కుటుంబసభ్యులు, బంధువులకు వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది.

also read:ఏపీపై కరోనా పంజా: ఒక్క రోజే 17 పాజిటివ్ కేసులు, మొత్తం 40కి చేరిక

రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా ఏం చేయాలనే దానిపై అధికారులతో సీఎం జగన్ సమాలోచనలు చేస్తున్నారు. విదేశాల నుండి రాష్ట్రంలో 28 వేల మంది వచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించింది.

ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మరో వైపు వీరి ట్రావెల్ హిస్టరీని కూడ సేకరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారితో సన్నిహితంగా మెలిగినవారిని క్వారంటైన్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

నిత్యావసర సరుకుల కొనుగోోలు సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. గతంలో మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరుకుల కొనుగోలుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. అయితే రెండు రోజుల నుండి ఈ సమయాన్ని ఉదయం 11 గంటలవరకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.