న్యూఢిల్లీ: యెస్​ బ్యాంకు పాలనాధికారిగా నియమించిన ప్రశాంత్ కుమార్​ తాజాగా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌, సీఈఓ నియమిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు బోర్డును పునరుద్ధరించింది. యెస్‌ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ మార్చి ఐదో తేదీ రాత్రి ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఖాతాదారులకు నెలకు రూ.50 వేల ఉపసంహరణకు వీలు ఉంటుందని తెలిపింది. అదే సమయంలో యెస్‌ బ్యాంకు బోర్డును రద్దు చేసింది. ఆర్బీఐ రూపొందించిన యెస్ ​బ్యాంకు పునరుద్ధరణ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మార్చి 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 

also read ఆ కారణంతోనే మైక్రోసాఫ్ట్‌ నుంచి తప్పుకున్న: బిల్ గేట్స్

మరో మూడు పని దినాల తర్వాత బ్యాంకుపై మారటోరియం ఎత్తివేస్తారు. దీని ప్రకారం యెస్​ బ్యాంకుపై మారటోరియాన్ని మార్చి 18న కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేయనున్నది. ఈ మేరకు సంక్షోభంలో యెస్​ బ్యాంకు కోసం ఆర్బీఐ రూపొందించిన పునరుద్ధరణ పథకాన్ని కేంద్రం నోటిఫై చేసింది.

ఆర్బీఐ రూపొందించిన యెస్​ బ్యాంకు పునరుద్ధరణ పథకం-2020 ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చిందని గెజిట్​ నోటిఫికేషన్​లో ప్రభుత్వం స్పష్టం చేసింది. యెస్ బ్యాంకును గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ చకచకా చర్యలు చేపడుతున్నాయి. 

ఇప్పటికే 49 శాతం వాటా కొనుగోలు చేయడానికి రూ.7,250 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఎస్బీఐ నిర్ణయం తీసుకున్నది. హెచ్‌డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు చెరో రూ.1000 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 

దీంతోపాటు వ్యక్తిగత ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టనున్నారు. యెస్ బ్యాంకులో దాదాపు 70 శాతం వాటా ఐదు సంస్థల ఆధీనంలో ఉండనున్నది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు వేర్వేరుగా శుక్రవారం ఎక్స్చేంజీలకు వేర్వేరుగా ఇచ్చిన సమాచారం ప్రకారం పెట్టుబడులు పెడతామని తెలిపాయి.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని 45 సెక్షన్ ఆర్బీఐ ప్రతిపాదించిన పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా రూ.10 విలువ గల 60 కోట్ల షేర్లను రూ.600 కోట్లతో కొనుగోలు చేయడానికి తమ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ స్పందిస్తూ.. యెస్ బ్యాంకులో రూ.500 కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపింది. 

also read పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం షాకింగ్ న్యూస్...

ఇదిలా ఉంటే యస్‌ బ్యాంకు కో ఫౌండర్‌ రాణా కపూర్‌కు సీబీఐ మరో షాక్‌ ఇచ్చింది. రాణా కపూర్‌, అతని భార్య బిందు, అవంతా రియాల్టీ ప్రమోటర్ గౌతమ్ థాపర్‌లపై తాజాగా మరో కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం తెలిపారు.

బ్లిస్ అబోడ్ కంపెనీ  డైరెక్టర్లలో ఒకరైన ఉన్న బిందుతోపాటు, మిగిలిన వారిపై మనీ లాండరింగ్‌ చట్టం ప్రకారం నేరపూరిత కుట్ర, మోసం కేసు నమోదు చేసినట్టు సీబీఐ తెలిపింది. ఈ కేసు ఢిల్లీలోని అమృత షెర్గిల్ బంగ్లా ఒప్పందానికి సంబంధించిందనీ, థాపర్ కంపెనీలకు రూ.2,000 కోట్లకు పైగా రుణాలకు సంబంధించి రూ.307 కోట్ల లంచం తీసుకున్నట్టు అనుమానాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

అమృతా షెర్గిల్ మార్గ్‌లోని 1.2 ఎకరాల బంగ్లాకొనుగోలకు కపూర్‌కు బ్లిస్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా లంచం ముట్టాయన్నారు. దీంతో బ్లిస్ అబోడ్ కార్యాలయంతోపాటు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ వెల్లడించింది.