రాణా కపూర్ కూతురుకి షాక్... విమానం ఎక్కుతున్న ఆమెను...

లండన్ చెక్కేయాలని భావించిన యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కూతురు రోష్ని కపూర్ ఆటలు సాగలేదు. ఆదివారం విమానం ఎక్కుతున్న ఆమెను ముంబై విమానాశ్రయ అధికారులు దింపేశారు. రాణా కపూర్ దంపతులు, వారి ముగ్గురు కూతుళ్లపై లుక్ఔట్ నోటీసులు జారీ చేయడమే దీనికి కారణం.

Yes Bank Founder's Daughter Roshni Kapoor Stopped At Mumbai Airport Before London Visit

న్యూఢిల్లీ: యస్‌ బ్యాంక్‌ అవినీతి కేసులో విచారణను ఎదుర్కొంటున్న బ్యాంక్‌ వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌ కుమార్తె రోష్ని కపూర్‌ లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబై విమానాశ్రయంలో అధికారులు అడ్డగించారు. ఈ కేసులో రోష్ని కపూర్‌ సహా రాణా కపూర్‌ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా లుక్‌అవుట్‌ నోటీస్‌ జారీ అయిన నేపథ్యంలో ఆమెను విమానాశ్రయంలో అధికారులు దేశం విడిచివెళ్లకుండా నిలువరించారు. 

మార్చి 11 వరకు రాణా కపూర్ కస్టడీ పొడిగింపు
ఈ కేసులో ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్‌ అయిన రాణా కపూర్‌ను మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి ముంబై కోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ముంబైలోని కపూర్‌, ఆయన కుమార్తెల నివాసాలపై ఈడీ దాడుల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

డీహెచ్ఎఫ్ఎల్ సహా పలు సంస్థలకు నిబంధనలకు భిన్నంగా రుణాలు
దివాలా తీసిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ దిగ్గజం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా పలు కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా రాణా కపూర్‌ ప్రోద్బలంతో పెద్దమొత్తంలో రుణాలు జారీ అయ్యాయని, అందుకు ప్రతిగా ఆయా కంపెనీల నుంచి రూ కోట్లు ముడుపులు కపూర్‌కు ముట్టాయని వెల్లడైంది. ఈ ముడుపులు స్వీకరించేందుకు కపూర్‌, ఆయన కుటుంబ సభ్యులు 20కిపైగా షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేశారని ఈడీ గుర్తించింది.

also read డజన్ల కొద్ది కంపెనీలు... వేల కోట్ల పెట్టుబడులు...ఇది రాణా కపూర్ స్టైల్...

ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్‌బీఐ
తప్పుడు విశ్లేషణలు చూసి కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందవద్దంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ మరోసారి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని బ్యాంకులను సునిశితంగా పరిశీలిస్తూనే ఉన్నామని, డిపాజిట్ల భద్రతకు ఢోకా ఉండదని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఆర్‌బీఐ ట్వీట్‌ చేసింది. 

మార్కెట్ క్యాప్‌పై ఆర్బీఐ ఇలా
మార్కెట్‌ క్యాప్‌ ఆధారంగా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఉండదని ఆర్బీఐ తెలిపింది. అటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ కూడా డిపాజిటర్లు ఆందోళన చెందవద్దని సూచించారు. బ్యాంకుల్లో సొమ్ము భద్రతను అంచనా వేసేందుకు వాటి మార్కెట్‌ క్యాప్‌ సరైన కొలమానం కాదని స్పష్టం చేశారు.

ఫోన్‌పే వినియోగదారులకు తీపికబురు
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యెస్‌ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. ఒక్కో వినియోగదారుడు నెలకు కేవలం రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకోవచ్చని ఆంక్షలు కూడా విధించింది. ఈ నిబంధన వల్ల ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్‌పే ఇబ్బందుల్లో పడింది. 

also read యెస్ బ్యాంకు ఎవరిది... ?.. ఎవరీ రాణా కపూర్... ?

యెస్ బ్యాంకుపై ఆంక్షలతో ఫోన్ ఫే కస్టమర్లకు ఇలా ఇబ్బందులు
యెస్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదుపై ఆంక్షల నేపథ్యంలో డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా ఫోన్‌పేలో లావాదేవీలు నిలిచిపోయాయి. ఈక్రమంలో ఫోన్‌పే యాజమాన్యం సేవలను పునరుద్ధరించే చర్యలు ప్రారంభించింది. 

ఐసీఐసీఐ బ్యాంకుతో ఫోన్ పే పార్టనర్ షిప్ ఒప్పందం
ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇకనుంచి ఫోన్‌పేకు యస్‌ బ్యాంకు స్థానంలో ఐసీఐసీఐ నగదు సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు ఫోన్‌పే ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సమీర్‌ నిగమ్‌ ప్రకటించారు. 

ఐసీఐసీఐ బ్యాంకు, యూపీఐలకు ఫోన్ పే ధన్యవాదాలు
సరైన సమయంలో ఆదుకున్నందుకు ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ)కు ధన్యవాదాలు తెలిపారు. యస్‌ బ్యాంకు సంక్షోభంతో ఫోన్‌పేతో పాటు మరో 15 థర్డ్‌ పార్టీ పేమెంట్స్‌ సంస్థల సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పాటు వాలెట్‌ సర్వీసులు కూడా తిరిగి అందుబాటులోకి రానున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios