యెస్ బ్యాంకు ఎవరిది... ?.. ఎవరీ రాణా కపూర్... ?
ఒక ప్రైవేట్ బ్యాంకు వ్యవస్థాపకుడిగా దశాబ్ద కాలంలోనే పతనం కావాల్సి రావడం రాణా కపూర్ ఊహించి ఉండకపోవచ్చు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన రాణా కపూర్ సారథ్యంలో 2004లో ఏర్పాటైన యెస్ బ్యాంకుపై 2015లో యూబీఎస్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రతికూలత మొదలైంది. 2017 ఆర్థిక సంవత్సరంలో మొండి బాకీలు రూ.6355 కోట్లకు చేరుకోవడంతో బ్యాంకు ఎండీ కం సీఈఓగా రాణా కపూర్ వైదొలగడానికి దారి తీసింది.
యెస్ బ్యాంకులో నెలకొన్న సంక్షోభం భారత బ్యాంకింగ్ రంగాన్నే షేక్ చేస్తోంది. ఈ నెల ఐదో తేదీన యెస్ బ్యాంకు లావాదేవీలపై ఆర్బీఐ మారటోరియం విధించింది. అంతేకాదు బ్యాంకు బోర్డును రద్దు చేసేయడంతోపాటు ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థ ఎస్బీఐతో కలిసి యెస్ బ్యాంకు గట్టెక్కించేందుకు చర్యలు ప్రారంభించింది సెంట్రల్ బ్యాంక్. ఈ ఎపిసోడ్ అంతటా రాణా కపూర్ కేంద్ర బిందువుగా నిలిచారు.
బ్యాంకు వ్యవస్థాపకుల్లో ఆయన ఒక్కరు కావడమే దీనికి కారణం. యెస్ బ్యాంకులో రాణా కపూర్ పాత్రపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. అతి తక్కువ కాలంలోనే ఉన్నత శిఖరాలకు ఎగసి.. అంతే కాలంలో పతనమైన చరిత్ర యెస్ బ్యాంకు వ్యవస్థాపకుడిదిగా ఉంది. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తును ఎదుర్కొంటున్న రాణా కపూర్ గురించి తెలుసుకుందాం.
also read యస్ బ్యాంక్‌లో వాటా...రూ.2490 కోట్లు కాదు.. రూ.10 వేల కోట్లు...
యెస్ బ్యాంకు వ్యవస్థాపకుల్లో ఒకరు రాణా కపూర్. బ్యాంకు మాజీ ఎండీ కం సీఈఓ కూడా. అంతకుముందు అసోచామ్ అధ్యక్షుడిగానూ రాణా కపూర్ పని చేశారు. 1957లో ఢిల్లీలో జన్మించిన రాణా కపూర్ 1973లో న్యూఢిల్లీలో స్కూలింగ్, 1977లో బీఏ డిగ్రీ పుచ్చుకున్నారు. 1980లో అమెరికాలోని రట్గర్స్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. బిందూ కపూర్‌ను పెండ్లాడారు. వారికి రాధా, రాఖీ, రోషిణి అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
తొలుత రాణా కపూర్ బ్యాంక్ అమెరికా బారాఖంబా శాఖలో జూనియర్ బ్యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి 16 ఏళ్లు అంటే 1996 వరకు కొనసాగారు. ఆ తర్వాత 1996-98 మధ్య ఎఎన్ జడ్ గ్రిండ్లేస్ సంస్థ జనరల్ మేనేజర్, కంట్రీ హెడ్ గా పని చేశారు.
తన సోదరుడు అశోక్ కపూర్, హర్ కిరత్ సింగ్ లతో కలిసి రాబో ఇండియా ఫైనాన్స్ అనే ఎన్బీఎఫ్సీని 1998లో ప్రారంభించారు. వీరు ముగ్గురు కలిసి 25 శాతం వాటా కలిగి ఉంటే, నెదర్లాండ్స్‌కు చెందిన రాబో బ్యాంక్ 75 శాతంతో రాబో ఇండియా ఫైనాన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. అదే ఏడాదిలో ముగ్గురు తమ వాటాలను విక్రయించి ప్రైవేట్ బ్యాంకు ఏర్పాటు కోసం లైసెన్స్ పొందారు. 2004లో యెస్ బ్యాంకు ఆవిర్భావానికి ముందు నేపథ్యం ఇది.
యెస్ బ్యాంకు భారీ మొండి బాకీల వల్ల దెబ్బ తిన్నా రాణా కపూర్ మాత్రం లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్ టైటిల్ దక్కించుకున్నారు. ప్రస్తుతం కింగ్ ఫిషర్స్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్య మాదిరిగా కేసులను ఎదుర్కొంటున్నారు రాణా కపూర్. బ్యాంకు ఇచ్చిన మొండి బాకీలను బాడ్ లోన్లుగా పరిగణించి పక్కకు పెట్టేస్తారు.
ఆ రుణం కింద గల ఆస్తిని మరో బ్యాంకర్‌కు అంటగడతారు. తర్వాత అదే ధరకు దక్కించుకోవడం ఓ పాలసీగా మారినా ఆర్బీఐ నిఘా ముందు కుదరలేదు. పదేపదే ప్రైవేట్ బ్యాంకుల్లో అవకతవకలు జరుగుతున్నా వాటిని ఆర్బీఐ ఎలా కాపాడగలుగుతుందన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.
also read ఇష్టరాజ్యంగా రుణాల మంజూరు వల్లే యెస్ బ్యాంకు కొంప ముంచింది...
యెస్ బ్యాంకు ఆస్తుల్లో నాణ్యతపై గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ యూబీఎస్ తొలుత 2015లో నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడం రాణా కపూర్ కెరీర్ లో తొలి ప్రతికూలతను ఎదుర్కొన్నట్లైంది. దీనిపై క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ వద్ద సదరు సంస్థకు వ్యతిరేకంగా కూడా రాణా కపూర్ ఫిర్యాదు చేశారు. మీడియా మేనేజ్మెంట్ లోనూ ఆరితేరిన రాణా కపూర్.. యూబీఎస్ నివేదిక అవాస్తవికం, పక్షపాత పూరితం, ప్రేరేపితం అనే ప్రచారాన్ని ముందుకు తెచ్చారు.
ఎంత కష్టపడి పని చేసినా ప్రొఫెషనల్‌గా వ్యవహరించినా 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాణా కపూర్ ఓటమి ఖాయమైంది. ఆ యేడాది యెస్ బ్యాంకు మొండి బాకీలు రూ.6,355 కోట్లకు చేరుకోవడం బ్యాంకు నుంచి రాణా కపూర్ నిష్క్రమణకు దారి తీసింది.